Begin typing your search above and press return to search.

లోకేశ్ మీద బాబును ప్ర‌మాణం చేయాల‌న్నాడు

By:  Tupaki Desk   |   30 May 2018 8:28 AM GMT
లోకేశ్ మీద బాబును ప్ర‌మాణం చేయాల‌న్నాడు
X
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త‌మ‌దే అధికారం అంటూ క‌ల‌లు క‌న్న చంద్ర‌బాబుకు.. వాస్త‌వం ఎలా ఉంటుందో విభ‌జ‌న త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు అర్థ‌మ‌య్యేలా చేశాయి. రెండు క‌ళ్ల సిద్ధాంత‌మంటూ క‌బుర్లు చెప్పిన చంద్ర‌బాబు.. చివ‌ర‌కు హైద‌రాబాద్ ను వ‌దిలేసి మ‌రీ ఆంధ్రాకు ప‌రిమితం కావాల్సిన ప‌రిస్థితి.

ఏ పార్టీని కాపాడుకోవ‌టం కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కులు చేసేందుకు ఓకే అన్నారో.. అదే పార్టీ తెలంగాణ‌లో అడ్ర‌స్ లేకుండా పోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

విభ‌జ‌న‌తో పాటు.. తెలంగాణ‌లో చేజారిన బాబు ప‌ట్టును గుర్తించిన తెలుగు త‌మ్ముళ్లు చాలామంది ఎవ‌రి దారి వారు చూసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలిన కొద్ది మందితో తెలంగాణ‌లో ఉనికిని చాటుకుంటూ కాలం నెట్టుకుంటూ వ‌స్తున్నారు. అయితే.. పార్టీలో ఉన్న కొద్ది మంది నేత‌ల్ని సైతం నిలుపుకోవ‌టానికి బాబు పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. వారి కెరీర్ కు సంబంధించి త‌న‌కు తానుగా ఇచ్చిన వ‌రాల్ని సైతం మ‌ర్చిపోవ‌టంపై ప‌లువురు త‌మ్ముళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇలాంటి అసంతృప్తుల్లో ఒక‌రు తెలంగాణ సీనియ‌ర్ నేత‌.. ఇటీవ‌ల వేటు ప‌డిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. తాను గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని చంద్ర‌బాబును అడిగిన‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల్ని ఆయ‌న కొట్టిపారేశారు. అంతేకాదు.. తాను కానీ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి గురించి బాబును అడిగిన‌ట్లుగా ఆయ‌న కానీ త‌న కుమారుడు లోకేశ్ మీద ప్ర‌మాణం చేస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని సంచ‌ల‌న స‌వాలు విసిరారు.

అవ‌స‌ర‌మైతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని ప్ర‌క‌టించిన మోత్కుప‌ల్లి.. బాబు తీరును తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద బాబును న‌మ్మి తాను ఎంత‌గా మోస‌పోయానో క‌న్నీరు పెట్టిన మోత్కుప‌ల్లి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో బాబు ఓడిపోయేలా చూడాల‌ని త్వ‌ర‌లో తాను మెట్లు ఎక్కి వేంక‌టేశ్వ‌ర‌స్వామిని వేడుకుంటాన‌న్నారు. పార్టీ నుంచి త‌న‌ను బ‌హిష్క‌రిస్తూ వేటు వేసిన వైనంపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

రాజకీయాల్లో చంద్ర‌బాబు అంత నీతిమాలిన వ్య‌క్తి లేడ‌ని.. జెండా సిద్ధాంతాలు తెలీవ‌ని.. 1982లో తామంతా స‌భ్య‌త్వం తీసుకున్న వేళ చంద్ర‌బాబు ఎక్క‌డ ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. ప‌నికిమాలిన వారి చేత త‌న‌ను తిట్టిస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మోత్కుప‌ల్లి.. ఓటుకు నోటు కేసులో బాబును.. బాబు అనుచ‌రుడు రేవంత్ ను కేసీఆర్ దొంగ‌ను ప‌ట్టుకున్న‌ట్లుగా ప‌ట్టుకుంటే కాళ్ల బేరానికి రాలేదా? అని ప్ర‌శ్నించారు. మోడీ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేదా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. పార్టీ నుంచి రేవంత్ వెళ్లిన త‌ర్వాత ఆయ‌న్ను ఏమీ అన‌కూడ‌దంటూ ర‌మ‌ణ‌కు చంద్ర‌బాబు చెప్పింది నిజం కాదా? అని నిల‌దీశారు.

కోట్లాది రూపాయిలు సంపాదిస్తున్న చంద్ర‌బాబు సింగ‌పూర్.. దుబాయ్ ల‌లో దాచుకుంటున్నార‌న్నారు. బాబు ఆక్ర‌మ సంపాద‌న‌పై కేంద్రం విచార‌ణ జ‌ర‌పాల‌న్నారు. బాబు ఉన్నంత కాలం మోడీ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ర‌న్న మోత్కుప‌ల్లి.. తానెవ‌రికీ అన్యాయం చేయ‌లేద‌న్నారు. కానీ.. త‌న‌కు మాత్రం చంద్ర‌బాబు అన్యాయం చేసిన‌ట్లుగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాల్లో బాబు అంత‌టి నీతిమాలిన వ్య‌క్తి లేడ‌ని దుయ్య‌బ‌ట్టారు. పార్టీ నుంచి చాలామంది నేత‌లు వెళ్లిపోతుంటారు కానీ మోత్కుప‌ల్లి త‌ర‌హాలో బాబును ఇంత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన నేత ఈమ‌ధ్య‌న ఎవ‌రూ లేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు