Begin typing your search above and press return to search.

ఇది బాబుకు ప‌డిన అస‌లైన పంచ్‌!

By:  Tupaki Desk   |   7 Jun 2018 4:44 PM GMT
ఇది బాబుకు ప‌డిన అస‌లైన పంచ్‌!
X
మోత్కుప‌ల్లి న‌ర్సింహులు... తెలంగాణ అనంత‌రం ఒకానొక స‌మ‌యంలో కేసీఆర్ క‌బంధ హ‌స్తాల్లో ఇరుక్కుని విల‌విల్లాడుతున్న తెలుగుదేశం పార్టీకి ర‌క్ష‌ణ క‌వ‌చంగా నిలిచిన వ్య‌క్తి. బాబు ఇచ్చిన భారీ హామీల‌తో ఆయ‌న పార్టీకి త‌న జీవితాన్ని త్యాగం చేశారు. చ‌రిత్ర మ‌ళ్లీ రిపీట‌య్యింది. హ‌రికృష్ణ‌, ఎన్టీఆర్ అల్లుడు ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావుకు జ‌రిగిన మోస‌మే మోత్కుప‌ల్లికీ జ‌రిగింది. ఇటీవ‌ల పార్టీ నుంచి వెలివేయ‌బ‌డిన మోత్కుప‌ల్లి ఎన్టీఆర్ వ‌ర్దంతి రోజు బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి ఆ పార్టీతో బంధానికి దాదాపు విడాకులు బ‌ల‌వంతంగా ఇచ్చేశారు. ఆయ‌న కోప‌మంతా చంద్ర‌బాబునాయుడుపైన గాని తెలుగుదేశంపైన కాదు. అందుకే ఒక్క చంద్ర‌బాబును మాత్ర‌మే ఆయ‌న విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు. కొంత గ్యాప్ తీసుకుని తాజాగా చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగిన మోత్కుప‌ల్లి... ఒక గ‌ట్టి స‌వాల్ విసిరారు బాబుకి. ఆ ఛాలెంజ్ న‌లుగురినీ ఆలోచింప‌జేసేలా ఉండ‌టం విశేషం.

*చంద్ర‌బాబుకు ఆత్మ‌విశ్వాసం - త‌న తెలివితేట‌ల‌పైన న‌మ్మ‌కం - అనుభ‌వం వ‌ల్ల వ‌చ్చిన జ్ఞానం ఉంద‌నుకుంటే ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టి నిజంగానే తాను స‌మ‌ర్థుడు అని నిరూపించుకోవాలి. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లాగ సొంత పార్టీపెట్టి నిల‌దొక్కుకుని త‌న స‌మ‌ర్థ‌త‌ను చాటుకోవాలి* అని మోత్కుప‌ల్లి వ్యాఖ్యానించారు.

ఈ స‌వాల్ చంద్ర‌బాబు స్వీక‌రించ‌రు. ఎందుకంటే అత‌ని పేరు చెబితే ఓట్లు రావు అని చంద్ర‌బాబుకు తెలుసు. అందుకే ఎన్టీఆర్ నీడ‌న బ‌తికేస్తుంటాడు. స్వ‌యం స‌మ‌ర్థ‌త లేదు. అందుకే సంద‌ర్భానుసారం ఎవ‌రినో ఒక‌రిని వాడుకుని నిల‌బ‌డుతూ ఉంటాడు. తాజాగా న‌న్ను వాడుకుని వ‌దిలేశారు. వాడి వ‌దిలేయ‌డం చంద్ర‌బాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని మోత్కుప‌ల్లి వ్యాఖ్యానించారు.

అయితే, చంద్ర‌బాబుకు చాలామంది చాలా స‌వాళ్లు చేశారు గాని ఇది కొంచెం అరుదైన స‌వాలే. బాబుని మ‌రెవ్వ‌రూ ఈ కోణంలో విమ‌ర్శించ‌లేదు. తెలుగుదేశంలో మ‌ధ్యంత‌రంగా అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌ద‌నంత‌రం అయినా పార్టీ పెట్టే సాహ‌సం చేయ‌లేదు. మోత్కుప‌ల్లి మాటలు వింటుంటే... చంద్ర‌బాబు ప‌రాన్న జీవే సుమా!