Begin typing your search above and press return to search.

వామ్మో.. ఈ ఏడుపులేంది మోత్కుప‌ల్లి?

By:  Tupaki Desk   |   28 Sep 2018 5:12 AM GMT
వామ్మో.. ఈ ఏడుపులేంది మోత్కుప‌ల్లి?
X
న్యాయం జ‌రిగింద‌నుకుందా?.. భారీ ద్రోహ‌మే జ‌రిగింద‌నుకుందాం? ఏం చేస్తాం? బాధ ప‌డ‌తాం.. వేద‌న చెందుతాం. ఆవేశంతో ర‌గిలిపోతాం.. ఆగ్ర‌హంతో ఊగిపోతాం. అదే.. న‌మ్ముకున్నోళ్ల కార‌ణంగా న‌ష్ట‌పోతే ఆ క‌ష్టం అంతా ఇంతా కాదు. అయితే.. అదెంత కాలం? నాలుగు రోజులు.. కాదంటే ప‌ది రోజులే. అంతేకానీ ఏడుపుగొట్టు సీరియ‌ల్ మాదిరి నెల‌ల త‌ర‌బ‌డి అదే ప‌నిగా ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అచ్చం మోత్కుప‌ల్లి న‌ర్సింహ‌ల మాదిరి ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాను న‌మ్ముకున్న చంద్ర‌బాబు త‌న‌ను న‌ట్టేట ముంచేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు మోత్కుప‌ల్లి. అయినా.. ప్ర‌పంచంలో బాబును న‌మ్ముకొమ్మ‌ని ఆయ‌న గురించి తెలిసిన వారు ఎవ‌రైనా చెబుతారా? బాబుకు వంద‌ల కిలోమీట‌ర్లు దూరంగా ఉండే వారు.. బాబు గురించి ఫుల్ ఐడియాతో ఉంటే.. ఆయ‌న‌తో త‌ర‌చూ మాట్లాడుతూ..క‌లుస్తూ.. మ‌రింత ద‌గ్గ‌ర‌గా చూస్తుండే మోత్కుప‌ల్లి మాష్టారి లాంటోడు మ‌రెంత జాగ‌రూక‌తో ఉండాలి.

ఎవ‌రికి చేసినా చేయ‌కున్నా మా బాబు బంగారం అనుకునే బాప‌తోళ్లు చాలామందే ఉంటారు. అందులో మోత్కుప‌ల్లి ఒక‌రు. అంత న‌మ్మినందుకు న‌ట్టేట ముంచేశార‌ని గుండెలు బాదుకోవ‌టంలో అర్థం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ప్ర‌పంచంలో ఎవ‌రైనా ఎవ‌రిని మోసం చేయ‌గ‌ల‌రు? న‌మ్మినోళ్లు మాత్ర‌మే. న‌మ్మ‌నోళ్ల‌ను ఎవ‌రెంత న‌ష్టం చేయ‌గ‌ల‌రు చెప్పండి. ఆ లెక్క‌న మోత్కుప‌ల్లి మాష్టారు బాబు విష‌యంలో ఎంత అలెర్ట్ గా ఉండాలి?

స‌రే.. గ‌వ‌ర్న‌ర్ గిరి ఇస్తామ‌ని ఊరించిన బాబు ఇవ్వ‌లేద‌నుకుందాం. చ‌డామ‌డా తిట్లు తిట్టేసి.. తిరుప‌తి వెంక‌న్న‌సాక్షిగా.. బాబు దుంప తెగిపోవాలంతే అంటూ కోరుకోవ‌ట‌మే కాదు.. మొక్కులు మొక్కిన మోత్కుప‌ల్లి.. కూసింత మంది మ‌నుషులు క‌నిపించినంత‌నే చిన్న పిల్లాడి మాదిరి వ‌ల వ‌ల ఏడ్చేయ‌టం ఎబ్బెట్టుగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. టీవీ డైలీ సీరియ‌స్ మాదిరి అదేప‌నిగా బాబును తిట్టేసే ఈ మాజీ తెలుగు త‌మ్ముడు తాజాగా మోత్కుప‌ల్లి శంఖారావం పేరుతో బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను చూసేందుకు.. త‌న మాట‌ల్ని వినేందుకు వ‌చ్చిన వారిని చూసి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. తాను అడ‌గ‌ను కూడా అడ‌గ‌లేద‌ని.. అయినా గ‌వ‌ర్న‌ర్ గిరి ఇస్తామ‌ని చెప్పి.. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం క‌న్ఫ‌ర్మ్ అని చెప్పి మరీ త‌న‌ను తొక్కేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పోన్లే ఎద‌వ బాబు ఏదోలా మోసం చేశాడ‌ని అనుకుందామంటే.. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాంటిప‌నే చేశాడ‌ని వాపోతున్నారు. ఎస్సీ నాయ‌కుడైన త‌న‌ను బాబు మాత్ర‌మే కాదు కేసీఆర్ సైతం తొక్కేయాల‌ని చూశార‌న్నారు. ఆలేరులో త‌న‌కు స‌హ‌కారం అందించి ఉంటే.. ఉమ్మడి న‌ల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలిపించేవాడినంటూ బీరాలు ప‌లుకుతున్నారు. ఇండిపెండెంట్ గా బ‌రిలో నిలిచి నా బ‌లం ఇంత‌.. అంత అని ఉత్తినే మాట‌లు చెప్ప‌టం.. వ‌ల వ‌లా ఏడ్చేయ‌టం కాక‌.. మోత్కుప‌ల్లి అంటే ఇదిరా.. అనేలా ఏదైనా చేస్తే బాగుంటుందేమో? అంతేకానీ.. ఈ ఏడుపు సీరియ‌ల్ ఏంది?