Begin typing your search above and press return to search.

బాబు డీల్‌ తో మోత్కుప‌ల్లి సెట్ అయిపోయాడే

By:  Tupaki Desk   |   2 March 2018 10:08 AM GMT
బాబు డీల్‌ తో మోత్కుప‌ల్లి సెట్ అయిపోయాడే
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నెల‌కొన్న అసంతృప్తి సెగ‌లు సెట్ అయిపోయాయి. టీ క‌ప్పులో తుఫాను లాగా...అసంతృప్తి అంతా ప్యాక‌ప్ అయిపోయింది. తెలంగాణ టీడీపీని టీఆర్ ఎస్‌ లో విలీనం చేయాల‌న్న పార్టీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం వెన‌క్కుపోయింది. అదే స‌మ‌యంలో బాబు జ‌పిస్తున్న పొత్తుల మంత్రం త‌న‌కు న‌చ్చడంతో పార్టీకోసం ప‌నిచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ‌ టీడీపీలో ఏర్ప‌డిన సందిగ్ద‌త‌ను చ‌క్క‌దిద్దుతూ ఎవ‌రూ క్ర‌మ‌శిక్ష‌ణ దాట‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో టీఆర్ ఎస్‌ తో పొత్తు అన్న‌ట్లుగా సిగ్న‌ల్స్ ఇచ్చారు.

సాక్షాత్తు టీడీపీ అధినేత పొత్తుకు ఓకే చెప్ప‌డంతో తాజాగా విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించిన మోత్కుప‌ల్లి త‌న ఆవేద‌న వెళ్ల‌గ‌క్కుతూ పార్టీ ప‌ట్ల అభిమానం ప్ర‌క‌టించారు. `నేను ఒక పేద‌వాన్ని...ప్రజలకు సేవ చెయ్యడం తప్ప వేరే ఆలోచన లేదు. ఎన్టీఆర్ నాకు రాజకీయ గురువు...ఆయన అశీస్సులతో ఆరు సార్లు గెలిచాను. ఎలాంటి సమస్యలు వచ్చినా నీతితో బతికాను. నా రాజకీయ జీవితంలో ఒక్క రోజు కూడా నా కోసం నా కుటుంబం కోసం ఆలోచన చెయ్యలేదు. పార్టీ నుంచి ఎంత మంది మారినా నేను మారలేదు. చంద్రబాబు సహకారంతో ఆయన అనుచరునిగా ఎన్టీఆర్ మరణం వరకు ఉన్నాను. ఎన్టీఆర్ దగ్గర ఎలా పనిచేసానో..చంద్రబాబు దగ్గర కూడా అలానే ఉన్నా. తెలంగాణ వాదం వచ్చినా నేను పార్టీ కోసం ప‌నిచేశాను. వ్యతిరేక ముద్ర వచ్చినా నేను టీడీపీతో ఉన్నాను. 2011లో చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రాలేదు...ఆనాడు ఆయనకు ఎవరైనా అండగా ఉన్నారా?` అని మోత్కుప‌ల్లి నిల‌దీశారు.

చంద్రబాబు దగ్గర పదవులు అనుభవించి చివరకు ఆయన్నే నిందించి పార్టీలు మారి ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని ప‌లువురిపై మోత్కుప‌ల్లి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. `నేను ఆయనకు అండగా ఉన్నా చంద్రబాబు వెంటే ఉన్నా. చంద్రబాబు అన్నం తిన్న వాళ్లే ఆయనకు నోట్లో మట్టి కొట్టారు. తెలంగాణవాదంలో మోత్కుపల్లిని చంపడానికి రెక్కీ నిర్వహించినా విషయం అందరికి తెలుసు. నా జీవితం బలిచేసి చంద్రబాబు నాయుడుకి నేను అండగా ఉన్నాను. నేను చంద్రబాబుకు సాయం చేసినా అని చెప్పుకునే స్థితిలో ఇవ్వాళ ఉన్నాను. తెలంగాణ వాదానికి నేను వ్యతిరేకిని కాదు..కానీ చంద్రబాబును తిడితే విమర్శిస్తే నేను తట్టుకోక చంద్రబాబుకు అండగా ఉన్నాను. పార్టీ నాకు ఏం ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా నేను చంద్రబాబు తమ్ముడినే.. కానీ చంద్రబాబు నేను లేకుండా మీటింగ్ పెట్టారు` అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తెలంగాణ వచ్చాక అనేక పరిణామాలు అందరికి తెలుసున‌ని మోత్కుప‌ల్లి అన్నారు. `టీడీపీలో సరైన నాయకత్వం లేకపోవడంతో టీడీపీ భ్ర‌ష్టుప‌ట్టిపోయింది. ఎవరికైతే నమ్మి నాయకత్వం ఇచ్చారో వాళ్ళే పార్టీ మోసం చేసి వెళ్లి పోయారు. నా కంటే చిన్న వాడైన రేవంత్ రెడ్డి ని నేను మంద‌లించాను. రేవంత్ ఎవ్వరిని పట్టించుకోకుండా ఓటుకు నోటు కేసులో పార్టీని బజారున పడేసారు. రేవంత్ రెడ్డి పది మందిని తీసుకొని పోతే అడిగిన మనిషి లేడు. డబ్బులు తీసుకుపోయి ఓటుకు నోటు కేసు లో ఇరుక్కుని పార్టీని భ్ర‌ష్టు పట్టించారు. రేవంత్ రెడ్డిని ఆనాడే సస్పెండ్ చేసి ఉంటే ఇవ్వాళ టీడీపీకి ఈ పరిస్థితి పట్టేది కాదు. నేను బజారు మనుషులు - నీతిమాలిన మనుషుల ముందు కూర్చున్నా అంటే నాయకుని మొఖం చూసే` అంటూ రేవంత్‌ పై నిప్పులు చెరిగారు. `ప్రతాప్ రెడ్డిని నెల రోజులు జైల్ లో పడితే ఎవరైనా రోడ్ల పైకి వచ్చారా? నాయకత్వ లోపం తెలంగాణ టీడీపీని పట్టి పీడిస్తోంది. టీఆరెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఉండాల్సిన టీడీపీ ఈ పరిస్థితికి వచ్చిందంటే కారణం ఎవరు...?నేను ఆనాడు మాట్లాడిన మాటలు ఇవ్వాళ నిజం అయ్యాయి. ఎన్టీఆర్ శిష్యులు అంతా టీఆర్ఎస్‌లో ఉన్నారు. నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి. నేను పార్టీ భవిష్యత్ కోసమే మాట్లాడాను` అని అన్నారు.

తెలంగాణ లో పార్టీ బలపడాలి అంటే చంద్రబాబు ఇక్కడ తిరగాలి..లేకపోతే పార్టీ బలపడే అవకాశం లేదని మోత్కుప‌ల్లి తేల్చిచెప్పారు. `చంద్రబాబు మాట్లాడిన మాటలను నేను స్వాగతిస్తున్నాను. పొత్తు ఎవరితో పెట్టుకున్నా మన బలం పెరుగుతుంది. చంద్రబాబు తిరగలేదు అనే బాధతో నేను మాట్లాడాను. సరే విలీనం వద్దు పొత్తు అయినా ఒకే. నేను క్షమాపణ చెప్పింది ఎవరైతే భాదపడుతున్నారో వారికే. నాకు రేవంత్ కి చాలా తేడా ఉంది...రేవంత్ రోగ్. చంద్రబాబు తెలంగాణా లో తిరగాలనే నేను కోరుకుంటున్నా. రాజకీయ పోరాటాలు వేరు...పొత్తుల విషయం వేరు. టీఆర్ ఎస్‌ పై పోరాటం చేసి సమయంలో రేవంత్ ఎక్కడ ఉన్నాడు? డబ్బు - ట్రిక్స్ తో రాజకీయాలు చేసే మనిషిని నేను కాదు. నేను ఏ పార్టీతో ఎవ్వరితో మాట్లాడలేదు. నేను మనోవేద‌నతో మాట్లాడుతున్నా...అందరూ నా ఆవేదన అందరూ అర్ధం చేసుకోవాలి. టీడీపీలో రమణ నాయకత్వం సరిగ్గా లేనందునే అందరూ పార్టీని వీడారు.` అని స్ప‌ష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తెలంగాణ భాద్యతలు ఇచ్చే విష‌యం త‌నకు తెలియద‌ని మోత్కుప‌ల్లి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పై సిద్ధాంత పరంగా అవకాశం ఉండదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.