Begin typing your search above and press return to search.

మోత్కుప‌ల్లి స్వ‌రం వెనుక ఆవేద‌న తెలుస్తోందా?

By:  Tupaki Desk   |   18 Jan 2018 10:56 AM GMT
మోత్కుప‌ల్లి స్వ‌రం వెనుక ఆవేద‌న తెలుస్తోందా?
X
తెలుగు దేశం పార్టీ... ఢిల్లీ న‌డి వీధుల్లో ఘోర అవ‌మానాల‌కు గుర‌వుతున్న తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వాన్ని కాపాడేందుకు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన పార్టీ. మూడున్న‌ర ద‌శాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ పార్టీ... అన్న గారు ఎన్టీఆర్ బ‌తికున్నంత కాలం తెలుగు నేల రాజ‌కీయాల‌తో పాటుగా జాతీయ రాజ‌కీయాల‌ను కూడా శాసించ‌గ‌లిగేంత‌గా త‌న‌దైన స‌త్తా చాటింది. నాడు నేష‌న‌ల్ ఫ్రంట్ ప్ర‌భుత్వం గానీ - ఆ త‌ర్వాత అట‌ల్ బిహారీ వాజ్ పేయి స‌ర్కారు ఏర్పాటులో గానీ... టీడీపీది కీల‌క భూమిక అన్న విష‌యం ఏ ఒక్క‌రు కూడా కాద‌న‌లేని స‌త్య‌మే. అయితే ఇప్ప‌టిటికీ తెలుగు నాట ఓ కీల‌క రాజ‌కీయ పార్టీగా వెలుగొందుతున్న టీడీపీ... ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక‌టైన తెలంగాణ‌లో అడ్రెస్ కోసం నానా తంటాలు ప‌డుతోందంటే అతిశ‌యోక్తి కాదేమో. ప్ర‌స్తుతం ఆ పార్టీ అధినేత‌గా ఉన్న ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అవలంబిస్తున్న వ్య‌వ‌హారాల కార‌ణంగా ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఆ పార్టీ నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే మ‌రి ఈ త‌ర‌హా వ్యాధి ప‌ట్టిన పార్టీకి పున‌రుజ్జీవం ల‌బిస్తుందా? అంటే... దాదాపుగా లేద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు ఎందుకంటే... పార్టీ తెలంగాణ శాఖ‌లో కీల‌క నేత‌లుగా ఎదిగిన వారంతా తెలుగు నేల రెండుగా విడిపోయిన త‌ర్వాత పార్టీని వీడిపోయారు. ఉన్న‌వారిలో చాలా మంది క్రియాశీల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న వారే త‌ప్పించి... క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేత‌ల‌ను నిజంగానే వేళ్ల‌పై లెక్క పెట్టొచ్చు.

ఈ త‌రుణంలో స‌రిగ్గా పార్టీ వ్య‌వ‌ష్థాప‌కుడు ఎన్టీఆర్ వర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఆ పార్టీ తెలంగాణ శాఖ‌లో కీల‌క నేత‌గా ఉన్న మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ ప‌రిస్థితికి అద్దం ప‌డుతున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. పార్టీలో తొలి త‌రం నేత‌గా ఉన్న మోత్కుప‌ల్లి... మొన్న‌టిదాకా అస‌లు పార్టీపైనా - పార్టీ అధినేత‌గా ఉన్న చంద్ర‌బాబుపైనా పల్లెత్తు మాట అని ఎరుగ‌రు. అలాంటిది ఒక్క‌సారిగా ఆయ‌న నోట పార్టీని టీఆర్ ఎస్‌ లో విలీనం చేస్తే స‌రిపోతుంది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు రావ‌డం నిజంగానే న‌మ్మ‌శ‌క్యం కాని విష‌య‌మే. ఈ ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌లేని స్థితిలో మోత్కుప‌ల్లి ఉన్నార‌ని అనుకోవ‌డానికి కూడా లేద‌నే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి ఆయ‌న వెన్నంటి - ఆ త‌ర్వాత పార్టీని హ‌స్త‌గ‌తం చేసుకున్న చంద్ర‌బాబు వెన్నంటి న‌డిచిన నేత‌గా మోత్కుప‌ల్లి ఏదో అదాటుగా ఈ మాట‌లు అని ఉంటార‌ని చెప్ప‌డానికి వీలే లేదు. పార్టీకి నిజ‌మైన కార్య‌క‌ర్త‌గా - బ‌ల‌మైన నేత‌గా ఉన్న మోత్కుప‌ల్లి వంటి నేత నోట పార్టీని ఇంకో పార్టీలో విలీనం చేసేయండ‌ని అంటే... ఆ వ్యాఖ్య‌ల వెనుక - మోత్కుప‌ల్లి మాట‌ల వెనుక ఉన్న ఆవేద‌న‌ను పార్టీ అధిష్ఠానం ప‌రిశీలిస్తుందా? అన్న విష‌యాలు ఇప్పుడు నిజంగానే పెద్ద చ‌ర్చ‌కు తెర లేపాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మొత్తానికి పార్టీ తెలంగాణ శాఖ‌ను అధిష్ఠానం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న మోత్కుప‌ల్లి ఆవేద‌న‌లో నుంచే ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వినిపించి ఉంటాయ‌ని సాక్షాత్తు పార్టీ తెలంగాణ శాఖ పెద్దల నుంచి కూడా వినిపిస్తున్నాయి. అందుకేనేమో... పార్టీ నేత‌లు ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా త‌మ అభిప్రాయాల‌ను నిర్భ‌యంగా వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని - మోత్కుప‌ల్లి చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌రిశీల‌న జ‌రుపుతామ‌ని పార్టీ తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ వ్యాఖ్యానించారు. మ‌రి మోత్కుప‌ల్లి ఎందుకు అలా బ‌ర‌స్ట్ అయ్యార‌న్న విష‌యాన్ని పార్టీ పెద్ద‌లు లోతుగా ప‌రిశీలిస్తారా? అన్న విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా మోత్కుప‌ల్లి ఉదంతానికి పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్య‌వ‌హార స‌ర‌ళే కార‌ణ‌మ‌న్న ఓ వాద‌న కూడా వినిపిస్తోంది. ఎంత ఏపీకి సీఎంగా ఉన్నా... పార్టీ జాతీయ అధ్య‌క్షుడి హోదాలో ఉన్న చంద్ర‌బాబు... తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాల‌ను నెల‌కో రోజు ప‌రిశీలిస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే క‌దా. అదే స‌మ‌యంలో పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శిగా ఉన్న చంద్రాబాబు త‌న‌యుడు - ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా పార్టీ తెలంగాణ శాఖ‌కు తాను అండ‌గా ఉంటాన‌ని కూడా హామీ ఇచ్చిన విష‌యాన్ని ఏ ఒక్క‌రు కూడా మ‌రిచిపోలేనిదే. అయితే వీరిద్ద‌రి ప్ర‌క‌ట‌న‌లు... ప్ర‌క‌ట‌న‌లుగానే మిగిలిపోయాయి త‌ప్పించి కార్య‌రూపం దాల్చిన దాఖ‌లా ఇసుమంతైనా క‌నిపించ‌లేద‌న్న‌ది కొంద‌రి వాద‌న‌. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ స‌మాధి హైద‌రాబాదులోనే ఉంది. ఎన్టీఆర్ ఘాట్‌ గా పేరు పెట్టిన స‌ద‌రు స‌మాధి వ‌ద్ద ఆయ‌న వ‌ర్ధంతికి - జ‌యంతికి పార్టీ నేత‌లంతా నివాళి అర్పించాల్సిన క‌నీస బాధ్య‌త అయితే ఉంద‌న్న‌ది అంద‌రి వాద‌న‌.

మ‌రి జ‌రుగుతున్న‌దేమిటి? పార్టీ వ్య‌వస్థాప‌కుడి వ‌ర్ధంతికి కూడా హైద‌రాబాదు రాలేనంత బిజీలో చంద్ర‌బాబు - లోకేశ్ బాబు మునిగిపోయారు. మ‌రి అలాంట‌ప్పుడు పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడినే ప‌ట్టించుకోలేని పార్టీ అధ్య‌క్ష‌ - ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు... ఇక పార్టీ తెలంగాణ శాఖ‌ను మాత్రం ఏం ప‌ట్టించుకుంటారు చెప్పండి. ఇక్క‌డే మోత్కుప‌ల్లి కూడా బ‌ర‌స్ట్ అయిపోయార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌గా వినిపిస్తోంది. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడినే గుర్తుంచుకోలేని స్థితిలో ఉన్న చంద్ర‌బాబు - లోకేశ్ బాబులు... నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న పార్టీ తెలంగాణ శాఖ‌ను ప‌ట్టించుకుంటార‌న్న గ్యారెంటీ ఏమిటి? అన్న‌దే మోత్కుప‌ల్లి ఆవేద‌న‌గా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎల్‌, ర‌మ‌ణ స్పందించిన తీరు కూడా పెద్ద‌గా లాభించేదేమీ కాద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ త‌న‌యుడిగా - పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ కూడా మోత్కుప‌ల్లి వ్యాఖ్య‌ల‌పై తానేమీ స్పందించ‌బోన‌ని చెప్పిన వైనం కూడా ఇప్పుడు నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో అస‌లు మోత్కుపల్లి నిర‌స‌న గ‌ళం ఎందుకు వినిపించార‌న్న విష‌యాన్ని కాస్తంత లోతుగా ప‌రిశీలించి - తెలంగాణ‌లో పార్టీని న‌మ్ముకుని ఉన్న కేడ‌ర్‌ కు కాస్తంత ధైర్యం నూరిపోయ‌డ‌మ‌నే గురుత‌ర బాధ్య‌త‌ను పార్టీ అధిష్ఠానం తీసుకుంటుందో? లేదంటే... ఎలాగూ విడిచిపెట్టేశాం క‌దా... ఇక దానిపై స్పందించేముంది? అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తుందో చూడాలి.