Begin typing your search above and press return to search.

మోత్కుపల్లి ఆశలు తీర్చని మోడీ

By:  Tupaki Desk   |   18 Aug 2016 7:15 AM GMT
మోత్కుపల్లి ఆశలు తీర్చని మోడీ
X
గవర్నరు పదవి కోసం చాలాకాలంగా ఆశలు పెట్టుకున్న తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఆ అవకాశం దక్కేలా లేదు. తాజాగా వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించగా అందులోనూ మోత్కుపల్లి పేరు లేదు. కొత్త లిస్టులో తన పేరు లేకపోవడంతో మోత్కుపల్లి తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఆయనకు గవర్నర్ పదవి ఖాయమని నిన్నమొన్నటి వరకు ప్రచారం జరిగింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా మహానాడులో బహిరంగంగానే ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని వద్ద మోత్కుపల్లి పేరును ప్రస్తావించారు. అయితే ఏమైందో తెలియదు కానీ పలు దఫాలుగా రాష్ట్రాలకు నియమిస్తున్న గవర్నర్ల స్థానంలో మోత్కుపల్లికి చోటు లభించడం లేదు. ఇప్పుడు మిగిలిన మూడు రాష్ట్రాలకు కూడా గవర్నర్లను ప్రకటించడంతో ఆయన ఆశలు అడుగంటిపోయాయి.

కాగా మోత్కుపల్లికి ఇక అవకాశాలు మూసుకుపోయినట్లేనని భావిస్తున్నారు. తమిళనాడు గవర్నరు రోశయ్యకు ఇంకో ఏడాది పదవీకాలం ఉంది. ఒక వేళ ఆయన స్థానంలో మోత్కుపల్లికి ఛాన్సు ఇస్తారని అనుకోవడానికీ అవకాశాలు కనిపించడం లేదని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. అప్పటికి టీడీపీ-బీజేపీ సంబంధాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. అంతేకాదు... రోశయ్యను పదవీ కాలం ముగిసేవరకు ఉంచకుండానే మధ్యలోనే రాజీనామా చేయించి కర్ణాటకకు చెందిన బీజేపీ నేత ఒకరికి ఆ ప్లేసులో ఛాన్సిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. దీంతో తమిళనాడు గవర్నరు అయ్యే అవకాశాలు కూడా అంతగా కనిపించడం లేదని చెబుతున్నారు.

కాగా మణిపూర్ - అసోం - పంజాబ్ రాష్ట్రాలకు గవర్నర్‌ లను - అండమాన్ నీకోబార్‌ కు లెఫ్టినెంట్ గవర్నర్‌ ను కేంద్ర ప్రభుత్వం తాజాగా నియమించిన సంగతి తెలిసిందే. మణిపూర్ గవర్నర్‌ గా కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా - పంజాబ్ గవర్నర్‌ గా విపి సింగ్ బద్నోర్ - అసోం గవర్నర్‌ గా బన్వారీలాల్ పురోహిత్ - అండమాన్ నీకోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌ గా ప్రొఫెసర్ జగదీష్ ముఖీ నియమితులయ్యారు. 76 సంవత్సరాల నజ్మా హెప్తుల్లా వయసు కారణంగా ఇటీవలే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నలుగురూ కూడా కేంద్రంలోని అధికార బిజెపితో దీర్ఘకాల అనుబంధం కలిగి ఉన్నవారే.