Begin typing your search above and press return to search.

అసలు విషయం చెప్పని మోత్కుపల్లి

By:  Tupaki Desk   |   24 Jun 2015 12:04 PM GMT
అసలు విషయం చెప్పని మోత్కుపల్లి
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీలో మరో కీలక వికెట్ పడనుందని, ఆయనే టీటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అని వార్తలు షికారు చేశాయి. తెలంగాణ టీడీపీలో వాయిస్ ఉన్న మోత్కుపల్లి సైకిల్ దిగి కారెక్కేందుకు రెడీ అవుతున్నారని, వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న తరుణంలో ఆయన పార్టీకి గుడ్ బై చెబుతున్నారని చర్చసాగింది. తెలంగాణలో టీడీపీలో తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో మోత్కుపల్లి ఉన్నారని, గవర్నరు పదవికి చేరువగా వచ్చి అవకాశం దక్కనందుకే మోత్కుపల్లి టీఆరఎస్ లో చేరుతున్నారని ప్రచారం జరిగింది.
గతంలో రాజ్యసభ సీటు ఇస్తారని మోసం చేశారని, కొద్దికాలం క్రితం ఈశాన్య రాష్ట్రాలకు గవర్నర్ గా పంపిస్తారని అదేమీ లేకుండా అబాసుపాలు చేశారని, టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే...ఉప ఎన్నికల్లో పోటీతో పాటు తగిన ప్రాధాన్యం ఇస్తామన్న సంకేతాలు గులాబీ పార్టీ నుంచి వచ్చాయని... అన్నీ చూసుకునే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని పెద్ద ఎత్తున చర్చసాగింది. టీడీపీకి మోత్కుపల్లి గుడ్ బై ఆ పార్టీకి పెద్ద దెబ్బ అన్న విశ్లేషణ సాగింది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

సెక్షన్‌-8ను గతంలోనే కేసీఆర్‌ ఎందుకు వ్యతిరేకించలేదని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబం సెంటిమెంట్‌ రెచ్చగొట్టి బతకాలనుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరిగిందని ఉద్యమం చేస్తానంటున్నావని కేసీఆర్‌ను నిలదీశారు. కేసీఆర్‌ మాట్లాడే తీరు హుందాగా లేదని, కుటుంబం పెత్తనాన్ని ప్రశ్నించే సమయం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌ తెలంగాణవాదాన్ని ముందుకు తెస్తున్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు.

ఇంతకు మీరు పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలపై ఏమంటారని ప్రశ్నించగా..అదిప్పుడు అసందర్భం, ఆ ఆలోచన లేదు అంటూ పొడిపొడిగా జవాబు ఇచ్చారు. అసలు విషయం చెప్పకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించారు.