Begin typing your search above and press return to search.

బీజేపీ గూటికి చేరిన టీడీపీ మాజీ మంత్రి!

By:  Tupaki Desk   |   7 Jan 2020 2:30 PM GMT
బీజేపీ గూటికి చేరిన టీడీపీ మాజీ మంత్రి!
X
తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టిపెట్టింది. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు తమతో కలిసి వచ్చే నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చాలామందిని ఇప్పటికే పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ గూటికి చేరారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చాలా కాలంగా ఏ పార్టీలో చేరని మోత్కుపల్లి మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత టీడీపీలోనే కొనసాగిన మోత్కుపల్లి పలు అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి, టీడీపీ నుండి బయటకి వచ్చారు. ఆ సందర్భంగా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మళ్లీ గెలవకూడదంటూ తిరుపతి వెంకన్నకు మొక్కుకున్నారు. టీడీపీ నుంచి బయటకు వెళ్లాక ఆయన రాజకీయాలకు కాస్త దూరమయ్యారు. ఆ తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అది సాధ్యం కాలేదు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ గా బరిలోకి దిగి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా మోత్కుపల్లికి పేరుంది. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికల తరుణంలో కొన్ని రోజులుగా ఆయన బీజేపీ నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. గత వారం రెండు దఫాలుగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ లతో సమావేశమైన మోత్కుపల్లి మంగళవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆకర్షితున్నై ఆ పార్టీలో చేరానని ఆయన చెప్పారు. కేసీఆర్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అమిత్ షాకు వివారించామని, పార్టీలో ఒక సైనికునిలా పనిచేస్తానని చెప్పారు.