Begin typing your search above and press return to search.

గవర్నర్‌ గిరి తర్వాత.. పార్టీ నుంచే జంప్‌

By:  Tupaki Desk   |   24 Jun 2015 9:28 AM GMT
గవర్నర్‌ గిరి తర్వాత.. పార్టీ నుంచే జంప్‌
X
మంచి వాగ్ధాటి ఉన్న తెలంగాణ తెలుగుదేశం నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. ఈ దళిత నేతకు భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉన్న మాట గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ మధ్యన మోత్కుపల్లి గురించి చాలా ఆసక్తికరమైన కథనాలు భారీగా వినిపించాయి. ఆయనకు మిత్రపక్షం కోటా కింద ఎన్డీయే సర్కారు ఏదో ఒక రాష్ట్ర గవర్నర్‌గా అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని టీడీపీ మహానాడు సందర్భంగా కూడా ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. మోత్కుపల్లికి గవర్నర్‌ గిరి తర్వాత.. ఆయన పార్టీ నుంచే జంప్‌ అయ్యే ఛాన్సులే ఎక్కువన్న వాదన తాజాగా షాకింగ్‌గా మారింది.

గత 20 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలే దీనికి కారణంగా మారింది. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన.. రాజ్యసభ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయనకు గవర్నర్‌ పదవి లభించబోతుందన్న మాట వినిపించటం.. ఆయన్ను తెలుగు తమ్ముళ్లు ముందస్తుగా అభినందించటం లాంటివి చాలానే జరిగిపోయాయి.

అయితే.. మీడియాలో వచ్చిన కథనాలకు.. వాస్తవానికి మధ్య అంతరాన్ని చాలా తొందరగానే గ్రహించిన మోత్కుపల్లి కాస్తంత కినుకుతో ఉన్నట్లు చెబుతున్నారు. గవర్నర్‌ పదవి మీద ఆశలు వదులుకున్న ఆయన.. త్వరలో జరిగే వరంగల్‌ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశ పడుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ ప్రయత్నం కూడా ఫలించే పరిస్థితులు లేవని తేలిపోవటం ఆయన్ను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెబుతున్నారు.

టీఆర్‌ఎస్‌నేత.. తెలంగాణరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన ఎంపీ పదవికి రాజీనామా చేయటంతో ఆ స్థానంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. అయితే.. ఈ ఉప ఎన్నికలో బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తోంది. మిత్రపక్షంగా బీజేపీకి టీడీపీ సహకరించే నేపథ్యంలో.. మోత్కుపల్లికి బరిలోకి దిగే ఛాన్స్‌ లేదని చెబుతున్నారు.

దీంతో.. ఆయన ప్రస్తుతం కారు ఎక్కే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి వరంగల్‌ సీటుకు కానీ హామీ ఇస్తే.. సైకిల్‌ దిగేసి..కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించి గుట్టుగా ప్రయత్నాలు మహా జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు. ఒకవేళ ప్రస్తుతం ఊహాగానాలుగా వినిపిస్తున్నఈ అంచనాలు నిజమైతే మాత్రం తెలంగాణలో టీడీపీకి భారీ దెబ్బ తగిలినట్లేనని చెబుతున్నారు.