Begin typing your search above and press return to search.

మోత్కుపల్లి మీద మళ్లీ ఆ ప్రచారం మొదలైంది

By:  Tupaki Desk   |   5 Sept 2016 4:00 AM IST
మోత్కుపల్లి మీద మళ్లీ ఆ ప్రచారం మొదలైంది
X
కేంద్రంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు ఓపక్క.. మరోవైపు అందుకు భిన్నమైన వార్త బయటకు రావటం ఆసక్తికరంగా మారింది. విభజన నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కటీఫ్ అన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి తీరు ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులకు గవర్నర్ పదవి లభించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి.. మోత్కుపల్లికి గవర్నర్ గిరి అన్న మాట గడిచిన రెండున్నరేళ్లలో చాలాసార్లే వినిపించిందని చెప్పాలి. ఈ విషయం మీద ఏపీ ముఖ్యమంత్రి కమ్ పార్టీ అధినేత చంద్రబాబు సైతం సూటిగా.. స్పష్టంగా చెప్పకపోవటాన్ని మర్చిపోకూడదు.

గవర్నర్ పదవులు ఖాళీ అయిన ప్రతిసారీ మోత్కుపల్లి రాజ్ భవన్ కు వెళ్లనున్నారన్నట్లుగా వార్తలు రావటం.. ఆతర్వాత అలాంటిదేదీ చోటు చేసుకోకపోవటం మర్చిపోకూడదు. అదిగో పులి అన్న కథకు తగ్గట్లే మోత్కుపల్లికి గవర్నర్ గిరి అన్న మాట ఈ మధ్యన తరచూ వినిపిస్తోంది. తాజాగా పలు రాష్ట్రాల గవర్నర్ పోస్టులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఓపక్క మోడీ సర్కారుతో టీడీపీ సంబంధాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కునుందన్న వార్తలో నిజం లేదన్న మాటను కొందరు వినిపిస్తున్నాయి. అయితే.. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ పాలక వర్గం తన కోటాలోని ఒక ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చిన నేపథ్యంలో.. మిత్రధర్మంలో భాగంగా మోత్కుపల్లికి గవర్నర్ పోస్ట్ ఇవ్వొచ్చన్న వార్తలు రావటం గమనార్హం. ఒకవేళ మోత్కుపల్లికి గవర్నర్ గిరి దక్కిన పక్షంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే వీలుందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యాసాగర్ రావుకు మహారాష్ట్ర గవర్నర్ గా ఎంపికైన వేళ.. ఆయనకు సీఎం కేసీఆర్ పౌర సన్మానం నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి గవర్నర్ పదవి దక్కటంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాదు.. విద్యాసాగర్ పై పొగడ్తలు కుమ్మరించారు.

ఇక.. మోత్కుపల్లి కానీ గవర్నర్ అయితే.. విద్యాసాగర్ మాదిరే ఆయనకు కూడా పౌరసన్మానం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉన్నట్లేనని చెబుతున్నారు. మోత్కుపల్లికి గవర్నర్ గిరి దక్కిన తర్వాత ఆయనకు సన్మానం చేయకుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని గౌరవించలేదన్న నింద తెలంగాణ సీఎం మీద పడుతుంది. ఈ నేపథ్యంలో రివాజుగా ఆయనకు సన్మానం చేయాల్సి ఉంటుంది. అయితే.. కేసీఆర్ లాంటి అధినేత అలాంటి పని చేస్తారా? అన్నది ఒక ప్రశ్న. అయితే ఇదంతా మోత్కుపల్లికి గవర్నర్ గిరి లభిస్తేనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటాయని చెప్పాలి.