Begin typing your search above and press return to search.

ఏంటీ మాట‌లు?మోత్కుప‌ల్లి కూడా జంపేనా?

By:  Tupaki Desk   |   12 Feb 2016 1:05 PM GMT
ఏంటీ మాట‌లు?మోత్కుప‌ల్లి కూడా జంపేనా?
X
తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ వార్త‌ల్లో నిలువ‌ని రోజంటూ ఉండ‌టం లేదు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాలు మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప్ర‌తిరోజు ప‌తాక శీర్షిక‌ల్లో తెలుగుదేశం పార్టీ నిలుస్తోంది. గ్రేట‌ర్ ఘోర ప‌రాజ‌యం - ఎమ్మెల్యేల జంపింగ్ షాక్‌ లో ఉన్న టీడీపీకి ఇపుడు పార్టీ సీనియ‌ర్ నేత‌ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు కూడా తోడ‌య్యారు. త్వ‌ర‌లో గ‌వ‌ర్న‌ర్ పద‌విని పొందుతార‌ని ప్ర‌చారంలో ఉన్న మోత్కుప‌ల్లి పార్టీలో త‌న గుర్తింపుపై తాజాగా క‌ల‌త చెందారు.

ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్తున్నానంటూ.. తెలంగాణ‌లో టీడీపీ మైన‌స్‌ కు చేరింద‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు ఏపీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అస్స‌లు తెలంగాణ‌పై దృష్టి సారించ‌లేద‌నే ఫీలింగ్ అంద‌రిలో నాటుకుపోయింద‌న్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న బాబు వారానికి ఒక‌సారి అయిన తెలంగాణ శాఖ గురించి ఆలోచ‌న చేయాల‌న్నారు. లేదంటే పార్టీ బ‌ల‌ప‌డ‌టానికి అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా త‌న‌కు పార్టీలో ఎదుర‌వుతున్న అనుభ‌వాల‌ను ఒకింత ఆవేద‌న‌తో పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో మీటింగుల్లో నన్ను ఎక్కడైనా చూశారా అంటూ త‌న‌తో ముచ్చ‌టించిన విలేక‌రుల‌కే మోత్కుప‌ల్లి ఎదురు ప్ర‌శ్న వేశారు. గ్రేటర్ ఎన్నికల్లో అయితే నా ప్రమేయమే లేదు అంటూ వాపోయారు. ఇంత‌కీ ఇలా ఎందుకు జ‌రుగుతోంద‌ని ప్ర‌శ్నిస్తే...త‌న‌ను ఎందుకు ప‌క్క‌న‌పెడుతున్నారో త‌న‌కే తెలియ‌డం లేద‌ని ఒకింత ఆవేద‌న‌తో చెప్పారు.

మోత్కుప‌ల్లి ఆవేద‌న నిజంగా ఆయ‌న‌కు గౌర‌వం ద‌క్క‌క‌పోవ‌డం వ‌ల్ల జ‌రుగుతున్న‌దా లేక‌పోతే ఆయ‌న ఏమైనా సిగ్న‌ల్స్ ఇస్తున్నారా అంటూ ఇపుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జరుగుతోంది. ఇంత‌కీ ఆయ‌న మాట‌ల‌కు అర్థం ఏమిటంటారు?