Begin typing your search above and press return to search.

మోత్కుప‌ల్లి స‌స్పెండ్‌..బాబుకు ఆ హ‌క్కు ఎక్క‌డిది?

By:  Tupaki Desk   |   28 May 2018 4:15 PM GMT
మోత్కుప‌ల్లి స‌స్పెండ్‌..బాబుకు ఆ హ‌క్కు ఎక్క‌డిది?
X
తెలుగుదేశం పార్టీలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఓ వైపు పార్టీ పండుగ అయిన మ‌హానాడును అట్ట‌హాసంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించుకుంటున్న స‌మ‌యంలోనే..మ‌రోవైపు ఆ పార్టీ ఉనికి కోల్పోతున్న తెలంగాణ‌లో క‌ల్లోలం నెల‌కొంది! ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీటీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ ప్ర‌స్తుత ర‌థ‌సార‌ధి - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లనే ఎన్టీఆర్ చనిపోయారని వ్యాఖ్యానించారు.రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చిన మామని చంపావు అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పార్టీ అధినేత చంద్ర‌బాబుపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు రమ‌ణ ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేస్తున్న‌ట్లు విజ‌య‌వాడ‌లో ప్ర‌క‌టించారు.

ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న మోత్కుపల్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లనే ఎన్టీఆర్ చనిపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పెద్ద నట చక్రవర్తి అని ఆరోపించారు. ``కాపులు - బీసీల మధ్య చంద్రబాబు గొడవ పెడుతున్నారు. మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టారు. ఇప్పుడు బ్రాహ్మణులను కూడా వదలడం లేదు. పవన్ - జగన్ సొంత జెండా పెట్టుకున్నారు..వాళ్లు మొగోళ్లు.ఎన్టీఆర్ నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగతనం చేశారు. ఆ ఇద్ద‌రు క‌లిస్తే బాబు ప‌ని మ‌టాషే. చంద్రబాబుకు చరిత్రలో ఓ నల్ల పేజీ ఉంది. చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి. హోదాపై యూ టర్న్ తీసుకుని సిగ్గు లేకుండా మళ్లీ హోదా అంటున్నారు. చంద్రబాబును పాతాళంలోకి తొక్కేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు`` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ కామెంట్లు క‌ల‌క‌లం రేపిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు లైన్లోకి వ‌చ్చారు. విజ‌య‌వాడ‌లో ఓ వైపు మ‌హానాడు జ‌రుగుతుండ‌గానే మ‌రోవైపు పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. మోత్కుప‌ల్లిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని టీటీడీపీ అధ్య‌క్షుడు ర‌మ‌ణ‌ను ఆదేశించిన‌ట్లు స‌మాచారం. దీంతో విజ‌య‌వాడ‌లోనే విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసిన ర‌మ‌ణ మోత్కుపల్లి విపరీత ధోరణి లో ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. మోత్కుపల్లికి గవర్నర్ రాదని తెలిసి గొడవ మొదలు పెట్టాడని దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్‌-ఎన్టీఆర్‌ కు ప్రతిరూపం అని నరసింహులు ఎలా చెపుతాడని ప్ర‌శ్నించారు. మోత్కుపల్లి ద్రోహానికి క్షమాపణ లేదని పేర్కొంటూ మోత్కుపల్లిని పార్టీ నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామ‌న్నారు.

ఇదిలాఉండ‌గా...టీడీపీ నుంచి బహిష్కరణపై మోత్కుపల్లి నర్సింహులు ఘాటుగా స్పందించారు. తనను బహిష్కరించే హక్కు వారికెక్కడిదని ప్రశ్నించారు. టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించారని.. ఆ జెండా నందమూరి వారిదని అన్నారు. మంగ‌ళ‌వారం త‌న నివాసంలో విలేక‌రుల స‌మ‌వేశం ఏర్పాటు చేస్తున్నాన‌ని తెలిపిన మోత్కుప‌ల్లి...బాబు గురించి అన్నివిష‌యాలు వెల్ల‌డిస్తాన‌ని అన్నారు.