Begin typing your search above and press return to search.

మోత్కుపల్లి @ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్?

By:  Tupaki Desk   |   14 Sep 2016 5:56 AM GMT
మోత్కుపల్లి @ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్?
X
గవర్నర్ గిరి ఆశలు పెట్టుకున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి కల తీరనుందా? పార్టీ అధినేతను తన సంగతి చూడాలంటూ ఆ మధ్యన ఓపెన్ గానే అడిగేసిన ఆయన కోరికను పార్టీ అధినేత తీరుస్తున్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఏన్డీయే భాగస్వామిపక్షంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్టు ఇస్తామని గతంలో ప్రదాని మోడీ హామీ ఇచ్చారు.

గడిచిన రెండేళ్ల రెండు నెలల వ్యవధిలో దీన్ని తీర్చింది లేదు. తాజాగా వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లికి ఈ దఫా గవర్నర్ గిరి ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పిందని చెబుతున్నారు. ఏపీకి ఇవ్వాల్సిన హోదాను పక్కన పెట్టేసి.. ప్యాకేజీతో సరిపెట్టిన మోడీ సర్కారు.. ముందస్తుగా అనుకున్న ప్రకారం.. అధికారపక్షానికి ఒక గవర్నర్ పదవి ఇస్తానన్న మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. వాస్తవానికి మోత్కుపల్లికి గతంలోనే గవర్నర్ పదవి ఇవ్వాల్సి ఉంది. కానీ.. ఏపీప్యాకేజీ ఒక కొలిక్కి రానందున ఆ వ్యవహారం పక్కకు వెళ్లింది.

తాజాగా.. ఆ ఇష్యూ తేలిపోవటం.. తమిళనాడు.. అరుణాచల్ ప్రదేశ్.. మధ్యప్రదేశ్ లలో గవర్నర్ పోస్టులు ఖాళీ అయిన నేపథ్యంలో మోత్కుపల్లికి గవర్నర్ గిరి పక్కా అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఖాళీ అయిన మూడు రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ మోత్కుపల్లికి ఇచ్చే వీలుందని చెబుతున్నారు. తమిళనాడు.. మధ్యప్రదేశ్ లలో తమ పార్టీకి చెందిన నేతలకే గవర్నర్ పదవులు ఇస్తారని.. అరుణాచల్ ప్రదేశ్ లో బలమైన బీజేపీ సర్కారు అధికారంలో ఉండటంతో పాటు వ్యూహాత్మకంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేని నేపథ్యంలో మోత్కుపల్లికి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ పోస్టు ఇవ్వటం పక్కా అని తెలుస్తోంది.