Begin typing your search above and press return to search.

గుజరాత్ ఎన్నిక‌లు..గూగుల్‌...చైనా విశ్లేష‌ణ!

By:  Tupaki Desk   |   15 Dec 2017 11:38 AM GMT
గుజరాత్ ఎన్నిక‌లు..గూగుల్‌...చైనా విశ్లేష‌ణ!
X
గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై దేశ‌వ్యాప్తంగా పార్టీల‌కు అతీతంగా ఆస‌క్తి - ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ స్వ‌రాష్ట్రం కావ‌డంతో పాటుగా ఆ పార్టీ 22 ఏళ్ల ఏక‌చ‌త్రాధిప‌త్యానికి బ్రేక్ వేయాల‌నే కాంగ్రెస్ ల‌క్ష్యం - కాంగ్రెస్ భ‌విష్య‌త్ సార‌థి రాహుల్ నేరుగా రంగంలోకి దిగిన నేప‌థ్యంలో...ఈ ఫ‌లితాలు అంద‌రిలో ఆస‌క్తి నింపాయి. అయితే ఈ క్రేజ్ రాజ‌కీయ నాయ‌కుల్లోనే కాదు..నెటిజ‌న్ల‌లోనూ...ఆఖ‌రికి పొరుగుదేశంతో పాటుగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో ఎంతో ఉత్కంఠ‌కు కార‌ణ‌మైంది. ఢిల్లీకి ద‌గ్గ‌రిదార‌నే పేరున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల త‌ర్వాత అంత‌టి ఆస‌క్తిని తిరిగి గుజ‌రాత్ ఎన్నిక‌ల విష‌యంలో ప్ర‌ద‌ర్శిస్తుండ‌టం విశేషం.

ఈ ఏడాదిలో భార‌త్‌ లోని కీలక రాజకీయ‌ ప‌రిణామాల గురించి గూగుల్ విడుద‌ల చేసిన వివ‌రాల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిందని గూగుల్ పేర్కొంది. ఢిల్లీకి ద‌గ్గరి దారి అనే పేరున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల త‌ర్వాత‌ అదే స్థాయిలో గుజ‌రాత్ గురించి ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని వెల్ల‌డించింద‌ని వివ‌రించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల గురించి గ‌ల్ఫ్ దేశాల్లో ఒక‌టైన యూఏఈలో ఎక్కువగా సెర్చ్ చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాలు - ఒమన్ - సౌదీ అరేబియాల్లో కూడా ఈ ఎన్నికల గురించి సెర్చ్ చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూస్తే...ఫ్రెంచ్‌ - జర్మన్ - యూకే జాతీయ ఎన్నికల తర్వాత ఎక్కువగా సెర్చ్ చేసినవి యూపీ ఎన్నికలే కావడం గమనార్హం. కాగా - బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో క‌మ‌ళ‌ద‌ళం భారీ విజయం సాధించి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే.

ఇదిలాఉండగా...పొరుగుదేశ‌మైన చైనా ఈ ఫ‌లితాల గురించి ఎక్క‌డ‌లేని ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌ధాని మోడీ ఇలాకా అవ‌డ‌మే కార‌ణం కాదు. చైనా వ్యాపార‌ - ఆర్థిక ప్ర‌యోజ‌నాలు ఇమిడి ఉండ‌టం కూడా ఈ ఉత్సుక‌త వెనుక కారణం. చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్ పేర్కొన్న‌ వివ‌రాల ప్ర‌కారం మోడీ విజ‌యాన్ని భారీ ఆధిక్యం - నామ‌మాత్ర‌పు గెలుపు కోణంలో చైనా గ‌మ‌నిస్తోంది. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో గెలుపొందితే జీఎస్టీ - నోట్ల ర‌ద్దు వంటి ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పలు విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు జనామోదం లభించినట్లే అవుతుంద‌ని చైనా పేర్కొంటోంది. అదే స‌మ‌యంలో నామమాత్ర‌పు గెలుపు సాధించినా లేదా ఓడిపోయినా....మోడీ సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించిన‌ట్లే అవుతుంద‌ని చైనా విశ్లేషిస్తోంది.

మోడీ గెలుపు ఓట‌ములు చైనాకు చెందిన పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని చైనా భావిస్తోంది. మోడీ గ‌ద్దెనెక్కిన త‌ర్వాత 2015తో పోలిస్తే 2016లో భారత్‌ లో చైనా పెట్టుబడులు పలు రెట్లు అధికమని...గుజ‌రాత్‌ లో బీజేపీ గెలిస్తే..మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తుంద‌ని...త‌ద్వారా త‌మ పెట్టుబ‌డుల‌కు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని భావిస్తోంది. అంతేకాకుండా గుజ‌రాత్‌ ఫ‌లితాల నేప‌థ్యంలో భార‌త్‌ లో కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్న కంపెనీలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చైనా అధికార ప‌త్రిక ముంద‌స్తుగా హెచ్చరించింది.