Begin typing your search above and press return to search.

సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ బాసర ట్రిపుల్ ఐటీలో రియల్ గా మారింది

By:  Tupaki Desk   |   21 Jun 2022 4:38 AM GMT
సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ బాసర ట్రిపుల్ ఐటీలో రియల్ గా మారింది
X
రీల్ కు రియల్ కు మధ్య తేడా బోలెడంత ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. రీల్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా.. ఆ మాటకు వస్తే అంతకుమించిన అన్న చందంగా రియల్ సీన్ ఒకటి చోటు చేసుకుంది. గడిచిన ఆరేడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు చేస్తున్న నిరసనకు సంబంధించి సోమవారం రేర్ సీన్ ఒకటి ఆవిష్క్రతమైంది. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ లేదంటే మంత్రి కేటీఆర్ రావాలంటూ కండీషన్ పెట్టిన వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేయటం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించకున్నా.. చివరకు పట్టు విడిచి దిగి రాక తప్పలేదు.

ఈ క్రమంలో వారు ఎండను భరిస్తూ.. చలికి తట్టుకుంటూ.. వర్షానికి ఎదురు నిలుస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఎదురైన సవాళ్లను ఎదుర్కొన్నారే కానీ అడుగు వెనక్కి వేయలేదు. ఎంతకూ తాము గీసుకున్న గీతలోనే ఉండిపోయి.. ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్న విద్యార్థుల ఆందోళనతో కేసీఆర్ సర్కారు కదలక తప్పలేదు. దీంతో.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేర్ సీన్ ఒకటి ఎదురైంది. జోరున కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకకుండా.. క్యాంపస్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు అలానే ఉండిపోయారు. కాకుంటే గొడుగులు వేసుకొని తాము ఆందోళన చేస్తున్న ప్లేస్ లోనే ఉన్నారు.

తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు తమ మధ్యనే చర్చలు జరపాలని.. అప్పుడు మాత్రమే ఆందోళనను విరమిస్తామని పేర్కొన్న వారు.. అందుకు తగ్గట్లే వ్యవహరించారు. నిజానికి విద్యార్థులు చేస్తున్న ఆందోళనను విరమించేలా చేయటం కోసం అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అదే సమయంలో తాము చేస్తున్న నిరసన పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నా.. తాము ఆందోళన చేస్తున్న ప్రాంతం నుంచి కదలకుండా ఉండిపోవటం చూస్తే.. వారి కమిట్ మెంట్ కు జోహార్లు అనాల్సిందే.

వర్షంలో తడుస్తూనే తమ పన్నెండు డిమాండ్లపై తెలంగాణ రాష్ట్ర విద్యా మంత్రి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలన్న డిమాండ్ మీదనే నిలిచారు. దీంతో.. తప్పనిపరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరిపారు. వందలాది మంది విద్యార్థుల సమూహం మధ్యనే ఆమె చర్చలు జరపటం గమనార్హం.

అంతేకాదు.. వారి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇవ్వగా.. తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరితే.. మంత్రిగా తాను మాట ఇస్తానని.. ఇంతకుమించి ఎలాంటి హామీ కావాలని సబిత చెప్పటంతో సమాధాన పడిన వారు.. చివరకు తమకు మంత్రి సబిత మీద నమ్మకం ఉందంటూ ఆందోళనను విరమించారు. మిగిలిన ఆందోళనలతో పోలిస్తే.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టుదలతో తమ ఆందోళనను కొనసాగించారు.

ఆదివారం మొత్తం ఎండలో ఎండిపోయిన వారు.. రాత్రిపూట చలిగాలిలోనే క్యాంపస్ బయట.. అది కూడా తాము ఆందోళన చేస్తున్న ప్రాంతంలోనే నిద్రపోయి నిరసనను చేపట్టారు. సోమవారం ఉదయాన్నే లేచిన వారు అక్కడే యోగా చేయటం.. తమ నిరసనను కంటిన్యూ చేయటం.. భారీగా వర్షం పడుతున్నా.. అందరు గొడుగుల మధ్యనే ఉన్నారు తప్పించి.. ఆందోళనను నీరుకార్చేలా మాత్రం వ్యవహరించకుండా జాగ్రత్త పడటం చూస్తే.. రాబోయే రోజుల్లో జరిగే ఆందోళనలకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పక తప్పదు.