Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్నికల ముందు వస్తున్న సినిమాలివే!

By:  Tupaki Desk   |   26 Oct 2022 9:40 AM GMT
ఏపీ ఎన్నికల ముందు వస్తున్న సినిమాలివే!
X
శివ, గాయం, రంగీలా, క్షణక్షణం, అనగనగా ఒకరోజు వంటి సినిమాలతో టాప్‌ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు.. రామ్‌ గోపాల్‌ వర్మ. అమితాబ్‌ బచ్చన్‌ వంటి స్టార్‌ హీరోలతోనూ సినిమాలు చేయగల స్థాయికి ఆర్జీవీ చేరుకున్నారు. అయితే ఆ తర్వాత వరుస ప్లాపులతో ఫేడవుట్‌ అయిపోయారు.

ప్రస్తుతం అడపదడపా రామ్‌గోపాల్‌ వర్మ సినిమాలు చేస్తున్నారు. కాగా గత ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ముందు రామ్‌గోపాల్‌ వర్మ రెండు సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లక్ష్మీస్‌ పార్వతి, కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని రెండు సినిమాలు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలు పెద్ద ఆదరణను దక్కించుకోలేకపోయాయి.

అయితే ఈ రెండు సినిమాల్లో డైలాగులు సోషల్‌ మీడియాలోనూ, టీవీల్లోనూ బాగా వైరల్‌ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్‌ కల్యాణ్‌లను టార్గెట్‌గా చేసుకుని వైసీపీ నేతలు ఈ సినిమాలను నిర్మించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

మళ్లీ ఏపీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం కంటే తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ పొలిటికల్‌ సినిమాలకు వైసీపీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఇవి తెరకెక్కుతాయని చెబుతున్నారు. ఇప్పటికే ఆయనతో వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజంపేట ఎంపీ, వైసీపీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి టలో ఉన్నారని అంటున్నారు.

హిట్లు, ప్లాపులకు అతీతంగా రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇటీవల మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి కథతో కొండా సినిమాను రామ్‌ గోపాల్‌ వర్మ తీశారు. అయితే అది విజయం సాధించలేదు.

అయినప్పటికీ ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్లో నెలకు రూ.12 లక్షల అద్దెకు రామ్‌ గోపాల్‌ వర్మ ఆఫీసు కూడా తీసుకున్నారని చెబుతున్నారు.

ఈ మూడు సినిమాల్లో రెండు రాజకీయ సినిమాలేనని పేర్కొంటున్నారు. ఈ రెండు సినిమాలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. గతంలో రామ్‌గోపాల్‌ వర్మను వైసీపీకి వ్యతిరేకంగా సినిమాలు తీస్తారా అని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా తీయనని ఆయన సమాధానం చెప్పడం గమనార్హం.

కాగా రామ్‌ గోపాల్‌ వర్మ తీయబోయే రెండు సినిమాలు 2024 ఎన్నికలే లక్ష్యంగా రూపొందుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాల్లో కథాంశం ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు. కాగా ఈ సినిమాల విషయమై రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కూడా రహస్యంగా కలిశారని టాక్‌ నడుస్తోంది.

కేవలం వైసీపీకి అనుకూలంగానే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు మద్దతుగా కూడా రామ్‌ గోపాల్‌ వర్మ ఒక సినిమా తీస్తున్నారని చెబుతున్నారు. దీన్ని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ నిర్మిస్తున్నారని అంటున్నారు.

ఈ సినిమాలే కాకుండా కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలపై మొత్తం పెట్టుబడి 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువేనని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.