Begin typing your search above and press return to search.

కోదండరామ్ కు మళ్లీ ఆ తోక అతికించారు

By:  Tupaki Desk   |   8 Jun 2016 7:09 AM GMT
కోదండరామ్ కు మళ్లీ ఆ తోక అతికించారు
X
టీఆరెస్ పార్టీ - తెలంగాణ ఉద్యమ నేత కోదండరాంల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కేసీఆర్ పై కోదండరాం నేరుగా విమర్శలు చేయడంతో ఆ పార్టీ నేతలు కోదండరాంపై మూకుమ్మడి దాడికి దిగుతున్నారు. మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు అందరూ ఒక్కసారిగా ఆయనపై ఎదురుదాడి ప్రారంభించారు. అయితే.. అన్ని విమర్శలు ఒక ఎత్తయితే ఆయనపై చేస్తున్న కుల విమర్శలు మరో ఎత్తు. కోదండరామ్ కు కుల ముద్ర వేసి.. కుల రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు చేయడం అంతటా ఆసక్తికరంగా మారింది. దీనిపై టీఆరెస్ పైనా విమర్శలొస్తున్నాయి. సాధారణ రాజకీయ నేతలను విమర్శించినట్లుగా కోదండరాంపైనా ఇలా కుల రాజకీయాల ముద్ర వేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

కోదండరాంపై కురుస్తున్న విమర్శల వర్షంలో ఎన్నో కొత్త కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. అయితే.. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి. ఆయన కోదండరాంను కోదండరాం రెడ్డి అంటూ సంబోధించి విమర్శలు గుప్పించడం అందరినీ ఆశ్చర్యానికి లోనుచేసింది. కోదండరాంరెడ్డి ఓ విషపు నాగు అంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అంతటా వ్యాపించాయి. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన సాధారణ నేత అయిన బాల్క సుమన్ ఇలా ఉద్యమ గురువును కులం ఆపాదించి విమర్శలు చేయడం వెనుక టీఆరెస్ పెద్దల సూచనలు ఉన్నాయంటున్నారు.

నిజానికి కోదండరాం.. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే అయినప్పటికీ చాలాకాలం కిందటే ఆయన ఆ తోకను కత్తిరించుకున్నారు. గతంలో దళితులపై జరిగిన ఊచకోతలకు నిరసనగా తన పేరు చివరన ఉన్న రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్న కోదండరాంపై ఇంతకాలం ఎవరూ రెడ్డి తోక తగిలించి విమర్శలు చేయలేదు. ఆయన స్వయంగా తొలగించిన కుల నామాన్ని టీఆరెస్ నేతలు పనిగట్టుకుని మళ్లీ తగిలించడంపై విమర్శలొస్తున్నాయి.