Begin typing your search above and press return to search.

ఎంపీ సెంట్రిక్‌గా టీడీపీలో ర‌చ్చ‌.. బాబు మౌనం!

By:  Tupaki Desk   |   29 Oct 2022 4:00 AM GMT
ఎంపీ సెంట్రిక్‌గా టీడీపీలో ర‌చ్చ‌.. బాబు మౌనం!
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఆయనో సీనియర్ నేత. లోక్ సభ సభ్యుడు కూడా. కాని ఆయన నియోజకవర్గంలో తిరగడంలేదట. కానీ తనకు గౌరవం తగ్గినట్లు అనిపిస్తే మాత్రం ఏ స్థాయి నేతైనా అయినా సరే ఏకిపారేస్తున్నారట. తాజాగా ఓ అసెంబ్లీ సెగ్మెంట్‌లో తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తిన వివాదం పార్టీలో రచ్చ అవుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని చాన్నాళ్లుగా పార్టీ అధినేత చంద్రబాబుతో దూరం మెయింటెన్ చేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలే ఆయన దూరం కావడానికి కారణమనే గుస‌గుస ఆయ‌న వ‌ర్గంలో వినిపిస్తోంది.

అయితే.. ఈ ప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కనిపిస్తోందంటున్నారు. ప్రతీ సెగ్మెంట్‌లోనూ పార్టీ ఇంఛార్జిలు వర్సెస్ క్యాడర్ అనేలా మారిపోయాయి ప్రస్తుత పరిస్థితులు. ఒంటెద్దు పోకడతో పోయేవారు కొందరైతే... ఈసారి టిక్కెట్ మాకు కావాలంటే మాకు కావాలంటూ పోటీ పడేవారు మరికొందరు. అయితే ఇలాంటి పంచాయతీనే తిరువూరు నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య చిచ్చు రాజేసింది. పైగా ఎంపీ కేశినేని నానికి, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జి నెట్టెం రఘురామ్‌కు మధ్య గ్యాప్ వచ్చేలా చేసింది.

తిరువూరు నియోజకవర్గం టీడీపీకి శావల దేవదత్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి తిరువూరులోని సీనియర్ల పెత్తనానికి దేవదత్ చెక్ పెడుతూ వస్తున్నారు. ప్రత్యేకించి తనకంటూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే దేవదత్ వైఖరి నచ్చకపోయినప్పటికీ సీనియర్లు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే... అతని ఒంటెద్దు పోకడలను తప్పుపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ సామాజిక మాధ్యమం ఐ-టీడీపీ కార్యకర్త ఒకరు దేవదత్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేవదత్ ఎంపీ కేశినేని నాని వద్ద పంచాయతీ పెట్టారు. తన వర్గానికి చెందిన నాయకులను పక్కన పెట్టేయడంతో కేశినేని నానికి.. దేవదత్ మీద పీకల వరకూ కోపం ఉందట. అందుకే దేవదత్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఐ-టీడీపీ కార్యకర్తను తన కార్యాలయానికి పిలిపించి...దేవదత్ ఎదుటే అతన్ని సన్మానించారట కేశినేని.

అంతటితో ఆగకుండా ఈసారి తిరువూరు టిక్కెట్ నీకు రాదు...ఇప్పటి వరకూ పార్టీ కోసం చేసిన ఖర్చుకి లెక్కలు చెబితే ఆ డబ్బు ఇచ్చేస్తానంటూ దేవదత్‌పై మండిపడ్డారట. ఊహించని ఈ పరిణామంతో దేవదత్ ఖంగుతిన్నారని సమాచారం. ఈ పరిణామం తర్వాత తిరువూరులో దేవదత్ తో పొసగని కేశినేని నాని వర్గం అంతా ఏకమయ్యారు. నియోజకవర్గ ఇంఛార్జిగా దేవదత్ తమకొద్దంటూ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం వద్ద పంచాయతీ పెట్టారట. మొత్తానికి ఈ విష‌యంలో చంద్ర‌బాబు జోక్యం చేసుకోవాల‌ని.. ఎంపీ చేస్తున్న రాజ‌కీయంతో పార్టీలో వివాదాలు పెరుగుతున్నాయ‌ని.. నాయ‌కులు అంటున్నారు. మ‌రి బాబు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.