Begin typing your search above and press return to search.

కానిస్టేబుల్ కూతురికి ఘనంగా పెళ్లి చేసిన సీఎం

By:  Tupaki Desk   |   11 Dec 2016 6:28 AM GMT
కానిస్టేబుల్ కూతురికి ఘనంగా పెళ్లి చేసిన సీఎం
X
ఆయనో రాష్ట్రానికి సీఎం.. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. అలాంటి కీలక నేత ఓ పోలీస్ అమరుడి కుమార్తె పెళ్లిని దగ్గరుండి ఘనంగా జరిపించారు. అతిథులను దగ్గరుండి ఆహ్వానించారు. సిమీ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన భోపాల్ జైలు హెడ్‌కానిస్టేబుల్ రామశంకర్ యాదవ్ కుమార్తె సోనియా వివాహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రులతో కలిసి వేడుకకు హాజరైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పెళ్లిలో అన్నీ తానై వ్యవహరించారు. పెళ్లితంతు ముగిసే వరకు అక్కడే ఉన్నారు.

ఈ ఏడాది అక్టోబరు 30-31 రాత్రి భోపాల్ జైలులో ఉన్న సిమీ ఉగ్రవాదులు తప్పించుకునే క్రమంలో రామశంకర్ యాదవ్‌ను హత్యచేసిన సంగతి తెలిసిందే. అప్పటికే ఆయన కుమార్తె సోనియా వివాహం నిశ్చయమైంది. దీంతో సోనియాకు ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఆ పెళ్లిని తానే దగ్గరుండి జరిపిస్తానని ముఖ్యమంత్రి చౌహాన్ అప్పట్లో హామీ ఇచ్చారు. అన్నట్టుగానే శుక్రవారం పెళ్లికి హాజరైన ముఖ్యమంత్రి దగ్గరుండి సోనియా వివాహాన్ని ఘనంగా జరిపించారు.

సోనియాకు గ్రేడ్-3 ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్‌ను పెళ్లిలో కానుకగా సోనియాకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుమార్తెల పెళ్లిళ్లు ఇక నుంచి ప్రభుత్వమే దగ్గరుండి జరిపిస్తుందని, పూర్తి ఖర్చులు భరిస్తుందని హామీ ఇచ్చారు. సోనియా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కుమార్తె అని చౌహాన్ పేర్కొన్నారు.