Begin typing your search above and press return to search.

'నన్ను ఆపడానికి మీరెవరు' .. ఎంపీ ధర్మపురి అర్వింద్

By:  Tupaki Desk   |   10 March 2021 7:30 AM GMT
నన్ను ఆపడానికి మీరెవరు .. ఎంపీ ధర్మపురి అర్వింద్
X
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బైంసాలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో భైంసా వెళ్తానని ప్రకటించారు అర్వింద్. అలాగే , అయన చెప్పినట్టే సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌ వెళ్లేందుకు యత్నించారు. దీనితో అర్వింద్‌ ను అడ్డుకున్న పోలీసులు అతన్ని తన నివాసానికి తరలించారు. భైంసాలో పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లొదని పోలీసులు సూచించారు. ఆయన ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే , అయనను పోలీసులు ఇంటికి తరలించే సమయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ , పోలిసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే .. తాను భైంసాకు వెళ్తున్నట్లు సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ట్వీట్‌ చేశారు. వెంటనే అప్రమత్తమైన బంజారాహిల్స్‌ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరవింద్ ‌ను అడ్డుకునేందుకు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ సమయానికే ఆయన వెళ్లిపోయినట్లు తెలియడంతో బంజారాహిల్స్‌ ఇన్ ‌స్పెక్టర్‌ ఆర్‌. కళింగరావు, ఎస్‌ ఐలు బాలరాజు, కె.ఉదయ్ ‌తో పాటు పోలీసులు పెట్రోకార్లలో ఆయనను వెంబడించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని పార్క్ ‌హయత్‌ హోటల్‌ ముందు నుండి వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. దీనితో కారులో నుంచి దిగిన అరవింద్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నన్ను ఆపడానికి మీరెవరంటూ' పోలీసులని ప్రశ్నించడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాను నిజామాబాద్‌ వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. హిందువులను నాశనం చేయాలనుకున్నారా.. తమాషా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో సహకరించాలని ఇన్‌ స్పెక్టర్‌ విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. నిజామాబాద్‌ వెళ్తుంటే వద్దని చెప్పేందుకు ఆర్డర్‌ ఏదంటూ నిలదీశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్‌ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి , ఆయన్ని ఇంటికి తరలించారు.