Begin typing your search above and press return to search.

'ఏపీని కావాలంటే తమిళనాడులో కలుపుకోండి'

By:  Tupaki Desk   |   10 Dec 2022 6:52 AM GMT
ఏపీని కావాలంటే తమిళనాడులో కలుపుకోండి
X
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 8 ఏళ్లయిపోయిన తరువాత మళ్లీ కొత్త మాటలు వినిపిస్తున్నాయి. తమది ఇప్పటికీ సమైక్య నినాదమే అని, అవకాశం దొరికితే ఏపీ, తెలంగాణలను కలిపే ప్రయత్నం చేస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనడంతో దీనిపై చర్చ మొదలైంది.

అయితే, తెలంగాణలోని పాలక టీఆర్ఎస్ పెద్దలు దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం దీనిపై మరో రకంగా స్పందించారు. కావాలంటే ఏపీని తమిళనాడులో కలుపుకోవాలంటూ సజ్జలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ విషయంలో సజ్జల మాటలు సరి కాదని... జగన్ తన సలహాదారును మార్చుకోవాలని ధర్మపురి అరవింద్ సూచించారు. మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినందున ఇప్పుడు సజ్జల అలాంటి కోరిక ఉంటే ఏపీని తమిళనాడులో కలుపుకోవాలన్నారు.

అంతే తప్ప తెలంగాణ జోలికి రావొద్దని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు సలహాదారుడిగా పెట్టుకున్నారంటూ ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. తక్షణమే జగన్ తన సలహాదారుడిని మార్చుకోవాలని సూచించారు.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా అర్వింద్ మండిపడ్డారు.. ఉపాధి హామీ పథకం నిధులను కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మళ్లించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నోటీసులు అందుకోవడం సిగ్గుచేటని ఎంపీ అరవింద్ అన్నారు. మద్యం వ్యాపారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు కానీ పేదలకు ఇచ్చేందుకు మాత్రం నిధుల్లేవని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'మిషన్ భగీరథ' ఇప్పటికీ పూర్తికాలేదని, కానీ కేంద్ర ప్రభుత్వం 'హర్ ఘర్ జల్' పథకం ద్వారా దేశంలో 50 శాతం పేదలకు నీటిని అందజేస్తోందని అన్నారు. ప్రధాని మోడీ 24 దేశాలకు వ్యాక్సిన్ పంపితే కేసీఆర్ రూ. 24 వేల కోట్ల అవినీతి సొమ్ము విదేశాల్లో దాచుకున్నారని ఆరోపించారు. మరో 9 నెలల్లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని ఆయనన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.