Begin typing your search above and press return to search.

కోతలు కోస్తున్న ఎంపీ... ?

By:  Tupaki Desk   |   2 Jan 2022 9:31 AM GMT
కోతలు కోస్తున్న ఎంపీ... ?
X
రాజకీయ నేతలు అంటేనే కోతలు కోస్తారు, గొప్పలు పోతారు, ఉన్నవి లేనివీ కలిపి చెబుతారు అని ఒక ప్రచారం అయితే ఉంది. అందరూ అలా కాకపోయినా కొందరి అతి వల్ల మొత్తం రాజకీయ వ్యవస్థకే ఇబ్బంది వస్తోంది. అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని ఒక పద్యం ఉంది. అలాగే అందరు ఎంపీలందూ కొందరు ఎంపీలు వేరాయా అని ఎపుడూ చెప్పాల్సి ఉంటుంది. ఇపుడు అలాంటి సందర్భమే ఒకటి వచ్చింది.

విశాఖ జిల్లా ఏజీన్సీకి చెందిన వైసీపీ మహిళా నేత. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తాజాగా చూస్తే భలేగా కోతలు కోస్తున్నారు. ఇది బాగా వైరల్ అవుతోంది. ఆమె గారి ఫోటోలను కూడా పెద్ద హెడ్డింగులు పెట్టి మరీ పత్రికల్లో రాశారు. ఇంతకీ ఎంపీ కోతలు కోయడమేంటి, అవి మాటల కోతలా లేక హామీల కోతలా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. కానీ ఈ ఎంపీ అలా కాదు, ఆమె పొలాల గట్ల వద్ద వరి కోతల పనులు చేస్తూ తాను అచ్చమైన స్వచ్చమైన మనిషిని అని చెబుతున్నారు.

పాతికేళ్లకే పార్లమెంట్ గడప ఎక్కిన గొడ్డేటి మాధవి తండ్రి కూడా ఒకపుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ఆయన సైతం కడు నిరాడంబరుడు. అందుకే సామాన్యుడిగానే జీవించారు అలాగే మరణించారు. ఆయన కుమార్తె అయినా కూడా టీచర్ గా తన జీవితాన్ని మొదలెట్టి గుట్టుగా బతుకుతున్న మాధవిని వైసీపీ ఏరి కోరి తెచ్చి మరీ అరకు ఎంపీని చేసింది.

ఇక 2019 ఎన్నికల్లో ఆమెకు వచ్చిన మెజారిటీ చూస్తే కళ్లు చెదరాల్సిందే. ఏకంగా రెండున్నర లక్షల పై చిలుకు మెజారిటీతో మాధవి రాజకీయ దురంధరుడు గా పేరు గడించిన కేంద్ర మాజీ మంత్రి కొశోర్ చంద్రదేవ్ ని ఓడించేశారు. దాంతో ఆమె ఏకంగా జాతీయ మీడియా దృష్టిలో కూడా పడ్డారు.

ఇక ఒక దశలో ఆమెను లోక్ సభ డిప్యూటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మాధవి అనేక కేంద్ర కమిటీలో ఉంటూ తన వంతుగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అదే టైమ్ లో ఆమె సొంత ఊరు వస్తే చాలు అచ్చమైన పల్లెపడుచుగా మారిపోతారు.

ఎంపీగా ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడినే భర్తగా ఎంచుకుని వివాహం చేసుకుని తాను ఏమిటో చెప్పిన మాధవి తమకు ఉన్న పొలంలోనే పనీ పాట చేయడాన్ని ఎపుడూ ఇష్టపడతారు. అలా ఆమె తాజాగా వరి కోత కోస్తూ కుప్ప నూడ్చుతూ కనిపించారు. ఆమె అందరిలాగానే వరి మూటలు కడుతూ అసలైన శ్రమజీవిలా మారిపోయారు.

దాన్ని లోకల్ రిపోర్టర్ ఒకర్ క్లిక్ మనిపించడంతో అరకు ఎంపీ సాధారణ జీవితం ఏంటి అన్నది లోకానికి తెలిసిపోయింది. దాంతో అందరూ ఆమె వ్యవహారశైలిని తెగ మెచ్చుకుంటున్నారు. పార్లమెంట్ మెంబర్ అంటే దర్జా బాబులకు అదొక హోదా. ఢిల్లీలోనే ఎపుడూ ఉంటూ తమను గెలిపించిన ప్రజలకు ముఖాన్ని చాటేసే మహానుభావులు ఉన్న రోజులు ఇవి. ఇక బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారూ ఉన్నారు. మరి కొందరి మీద సీబీఐ కేసులు పెట్టింది, తాజాగా ఒక ఎంపీగారి మీద చార్జిషీట్ కూడా పడింది.

ఇలా తమ హోదాను ప్రజల కోసం కాకుండా తమ కోసం వాడుకుంటూ తాము గెలిచిన ప్రాంతాల‌ను, పుట్టిన నేలను మరచి ఢిల్లీనే కేరాఫ్ చేసుకున్న ఎందరో ఉన్న ఈ కాలంలో కూడా తమ ఊరు, ఇల్లూ, పొలం పుట్రా మీద అమితమైన ప్రేమను పెంచుకున్న అరకు ఎంపీ మాధవి లాంటి ఉండడం నిజంగా అరుదు అనే చెప్పాలి. పైగా ఎలాంటి భేషజాలకు పోకుండా తమ పనులను తామే చేసుకోవడం అంటే గ్రేటే అనాలి కదా. ప్రజాస్వామిక దేశాన సామాన్యుడు గెలవాలి అని అంతా అంటారు. అలాంటి సామాన్యురాలే ఇపుడు హస్తినాపురిలో ఎంపీగా ఉన్నారని తెలుగు ప్రజలు అయితే గర్వించవచ్చు.