Begin typing your search above and press return to search.

మ‌న బాబుకు త‌గ్గట్లే..అక్క‌డా ఓ సీఎం ఉన్నారు

By:  Tupaki Desk   |   25 April 2019 4:52 AM GMT
మ‌న బాబుకు త‌గ్గట్లే..అక్క‌డా ఓ సీఎం ఉన్నారు
X
ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వారేం చేస్తారు. ఖ‌ర్చు త‌గ్గిస్తారు. ఆదాయాన్ని మ‌రింత పెంచుకునేలా ప్లాన్ చేస్తారు. ఈ రెండింటితో దాదాపుగా క‌ష్టాలు క‌వ‌ర్ అయ్యే అవ‌కాశం ఉంది. కానీ.. ఇలాంటివేమీ చేయ‌ని త‌త్త్వం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సొంతంగా చెబుతారు. విభ‌జ‌న నేప‌థ్యంలో పీక‌ల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో ఉన్న ఏపీకి త‌న ఖ‌ర్చుల‌తో మ‌రింత భారం అయ్యేలా చేస్తుంటారు చంద్ర‌బాబు.

ఖ‌ర్చుల విష‌యంలో బాబు మీద ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఆయ‌న తీరులో మాత్రం మార్పు రాద‌ని చెప్పాలి. తాజాగా బాబుకు త‌గ్గ‌ట్లే మ‌రో ముఖ్య‌మంత్రి ఖ‌ర్చు వ్య‌వ‌హారం ఇప్పుడు వివాదంగా మారింది. దీర్ఘ కాలం త‌ర్వాత అధికారం చేతిలోకి వ‌స్తే.. దాన్ని మ‌రింత స్థిర‌ప‌ర్చుకోవాల‌న్న కామ‌న్ సెన్స్ స‌ద‌రు కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిలో మిస్ అవుతున్న వైనం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మాన‌దు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఆ మ‌ధ్య‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన పాత‌కాల‌పు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్ నాథ్‌.. తాజాగా త‌న తీరుతో వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఈ మ‌ధ్య‌న ఆయ‌న ముగ్గురు అధికారుల‌తో క‌లిసి స్విట్ల‌ర్లాండ్ కు వెళ్లారు. ఎందుకంటారా? అక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సుకు హాజ‌రుకావ‌టం ద్వారా మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుక‌ని చెబుతున్నారు.

పెట్టుబ‌డుల మాటేమో కానీ.. ఈ ట్రిప్ ఖ‌ర్చు మాత్రం రూ.1.58 కోట్లుగా తేలింది. ఒక ముఖ్య‌మంత్రి.. ముగ్గురు బ్యూరోక్రాట్లు వెళ్లిన ట్రిప్ కు ఇంత భారీగా ఖ‌ర్చు చేస్తారా? అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య‌మంత్రి వారి ఖ‌ర్చు లెక్క‌లు తాజాగా బ‌య‌ట‌కు రావ‌టంతో గ‌గ్గోలుగా మారింది. ఎయిర్ టికెట్.. వీసా.. వ‌స‌తి.. జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో వీఐపీ లాంజ్ లోకి ఎంట్రీతో పాటు ఇత‌ర ఖ‌ర్చుల‌న్ని క‌లిపి.. రూ.1,57,85,000 ఖ‌ర్చు చేసిన‌ట్లుగా స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్ర‌జాధ‌నాన్ని ప‌ప్పుబెల్లాల మాదిరి వాడేస్తున్న తీరుపై అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న ఉద్య‌మ‌కారుడు అజ‌య్ దూబే బ‌య‌ట‌పెట్టారు. దీంతో.. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఖ‌ర్చు లెక్క‌ను చూసిన వెంట‌నే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దుబారా గుర్తుకు రావ‌టం ఖాయం. అధినేత‌ల ప్ర‌యాణాల‌తో రాష్ట్రాల‌కు పెట్టుబ‌డుల సంగ‌తి త‌ర్వాత‌.. ఖ‌ర్చు పోటు మాత్రం భారీగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.