Begin typing your search above and press return to search.

ఏమి సెప్తిరి జీవీఎల్ సారూ : జగన్ బటన్ వెనక బలం మోడీదేనా...?

By:  Tupaki Desk   |   12 July 2022 2:30 AM GMT
ఏమి సెప్తిరి జీవీఎల్ సారూ : జగన్ బటన్ వెనక బలం మోడీదేనా...?
X
కేంద్రం అన్నది మిధ్య అని నాడు మహానుభావుడు ఎన్టీయార్ అన్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో కానీ, కేంద్రం అంటే అన్ని రాష్ట్రాల సమాహారమే కదా. రాష్ట్రాల నుంచే కదా కేంద్రానికి ఆదాయం వచ్చేది. అలా వచ్చిన ఆదాయం నుంచి కేంద్రం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వడం సమంజసం. ఇది పద్ధతి, ఇదే సమాఖ్య స్పూర్తి, ఇదే రాజ్యాంగ నీతి కూడా. మరి అలా ఇచ్చిన ప్రతీ పైసాను లెక్కేసి రాజకీయం చేయడం బీజేపీ దివాళాకోరుతనమే అని అంటున్నారు.

ఏపీలో బీజేపీ నాయకులు నోరు తెరిస్తే చాలు మేమే ఏపీని నడిపిస్తున్నామని అంటారు. మేమే కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నామని అంటారు. మేము లేకపోతే ఒక్క నిముషం కూడా ఏపీ బండి సాగదు అని కూడా చెబుతారు. అంతా బాగానే ఉన్నా ఏపీ దేశంలో భాగం కాదా పైగా ఏపీ జనాలు కట్టే పన్నులు కేంద్రానికి చేరవా అన్న ప్రశ్న సగటు జనాలు వేస్తున్నారు.

ఇక బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే చాలా తెలివిగానే మాట్లాడుతూంటారు. జగన్ ఇక్కడ బటన్ నొక్కి పేదలకు నగదు బదిలీ చేస్తున్నారు. కానీ ఆ బటన్ వెనక ఉన్న బ్యాటరీ మోడీ ఇచ్చినది తెలుసా అని కొత్త విషయం చెబుతున్నట్లుగా చెబుతున్నారు. జగన్ బటన్ వెనక మోడీ బ్యాటరీ ఉందని  వైసీపీ నేతలు ఎందుకు చెప్పడం లేదు అని జీవీఎల్ సార్ వారు గద్దిస్తున్నారు. కేంద్రం చేసే ఆర్ధిక సాయం గురించి ఎందుకు చెప్పడం లేదని బాగా మధనపడుతున్నారు.

కేంద్రం అన్నదే సాయం చేయకపోతే మీ బటన్ అసలు పనిచేసేదే కాదు కదా అని ఎద్దేవా చేస్తున్నారు. కానీ జీవీఎల్ వారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కేంద్రం ఇచ్చే నిధులు ఏవైనా సరే  ప్రజలు కట్టే పన్నుల నుంచే కదా, జీఎస్టీ ద్వారా ఏపీ నుంచి పెద్ద ఎత్తున నిధులు కేంద్రానికి వెళ్తున్నాయా లేవా అన్నది కూడా ఎంపీగానే చెప్పాలిగా. అలా వెళ్ళిన నిధుల నుంచి కొంత ఉంచుకుని కొంత ఏపీకి కేంద్రం అయినా మోడీ అయినా ఇస్తున్నారేమో. ఆ మాత్రం భాగ్యానికి తామేదో మొత్తానికి మొత్తం కేంద్ర ఖజానానే ఏపీకి దోచిపెడుతున్నట్లుగా ఎందుకు ఈ స్తోత్రపాఠాలు కాషాయం నేతలూ అంటున్నారు జనాలు.

అయినా సరే బీజేపీ నేతలు  ఈ దీర్ఘాలు ఆపరు, ఈ ఆర్భాటపు  మాటలూ అంతకంటే ఆపరు. అయినా కేంద్రమిచ్చినా ఎవరిచ్చినా  ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అనే వ్యవస్థ నుంచే ఏ  పధకాలు అయినా అందాలి. అవి అందుతున్నపుడు రాష్ట్ర ప్రభుత్వాన్నే జనాలు మొదట  గుర్తిస్తారు. దాని మీద వీధి కుళాయి తగాదాలు పడినా వేస్టు తప్ప మరేమీ లాభామే లేదు.

కనుక  ఈ చిల్లర మల్లర రాజకీయ  విషయాలు మానేసి కేంద్రం మాత్రమే చేయదగినవి, చేసేవి  గొప్ప  పనులు కొన్ని ఉంటాయి అవి చేస్తే కచ్చితంగా బీజేపీ వారే చేశారు అని ఏపీ  జనాలు గుర్తు పెట్టుకుని మరీ రేపటి రోజున ఓట్లేసినా వేస్తారు. అవేంటి అంటే విభజన హామీలు నెరవేర్చడం, ప్రత్యేక హోదాను అమలు చేయడం, పోలవరం ప్రాజెక్టుని  సత్వరం పూర్తి చేయడం వంటివి. మరి ఈ పనులు చేయడం మానేసి, మేము ఉచిత బియ్యం ఇస్తున్నాం, ఏపీని నిధులు  ఇస్తున్నాం అని ఎంత చెప్పుకున్నా బీజేపీని గుర్తిస్తారా. ఈ విషయాలు బీజేపీ వారికి తెలుసు. కానీ మరీ ఇంత రాజకీయ గడుసుదనమే  ఏపీ జనాల వద్ద కుదరదు అన్నదే కాషాయ నేతలకు  అర్ధం కావడంలేదా అని  అంటున్నారు.