Begin typing your search above and press return to search.

బాబు ఎంట్రీ ఇచ్చినా..తాడిప‌త్రి ర‌చ్చ స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు

By:  Tupaki Desk   |   17 Sep 2018 11:06 AM GMT
బాబు ఎంట్రీ ఇచ్చినా..తాడిప‌త్రి ర‌చ్చ స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు
X
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో చెలరేగిన అల్లర్లు ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పడిన వివాదంతో తాడిపత్రి అట్టుడుకుతోంది. ఆదివారం ఉదయం జేసీ అనుచరులు ప్రబోధానంద ఆశ్రమంపై దాడికి దిగారు. కనిపించిన వారినల్లా చితకబాదారు. భక్తులు కూడా ఎదురుదాడికి దిగడంతో పోలీసులు భాష్పవాయువును - గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ వేణుగోపాల్ - మరో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ తో సహా పలువురికి తీవ్రగాయాలు కాగా - ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ఎంపీని వాహనం ఎక్కించి తాడిపత్రికి తరిలించారు. దీనికి నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. తనకు భద్రత అవసరం లేదని ఎంపీ దివాకర్ రెడ్డి తన ఇద్దరు గన్ మెన్లను అక్కడి నుంచి పంపించివేశారు. పోలీస్ స్టేషన్ గేట్ కు తాళం వేసి ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా హిజ్రాలతో నినాదాలు చేయించారు. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా టీడీపీ తీరును తీవ్రంగా ప‌లుచన చేసిన నేప‌థ్యంలో...సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు.

చిన్నపొలమడ గ్రామంలో ఆదివారం మరోమారు శ్రీకృష్ణ త్రైత సిద్ధాంత ఆశ్రమ నిర్వాహకులు - గ్రామస్తులు పరస్పర దాడులకు దిగారు. దీంతో ఏ నిమిషంలో ఏమి జరుగుతుందోనన్న భయాందోళనలో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌ రెడ్డి గణేశ్ నిమజ్జనంలో గాయపడిన చిన్నపొలమడ గ్రామస్తులను పరామర్శించాడనికి వెళ్తుండగా ఆశ్రమం రోడ్డులో పోలీసులు అడ్డుకుని - మరొక దారిలో వెళ్లాలని కోరారు. దీంతో ఎంపీ జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా - ఎంపీనైన నన్నే అడ్డుకుంటారా అంటూ వాహనం దిగి రోడ్డు పైనే బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అక్కడికి భారీగా తరలిరాగా చిన్నపొలమడ రోడ్డు పైనే టెంట్ వేసి ఎంపీ జేసీ ధర్నాకు దిగారు. ఈక్రమంలో గ్రామస్తులు ఆశ్రమంపైకి రాళ్లు రువ్వగా ఆశ్రమం నిర్వాహకులు కూడా రాళ్లు విసిరారు. ఇలా దాదాపు మూడు గంటలకు పైగా ఇరువర్గాలు రాళ్లు రువ్వుకుంటున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఒక దశలో గ్రామస్తులు బాటిళ్లలో పెట్రోల్ పోసి నిప్పంటించి ఆశ్రమం పైకి విసిరారు. దీంతో 200మంది ఆశ్రమం నిర్వాహకులు గ్రామస్తులు - టీడీపీ శ్రేణులను తరుముకుంటూ ఎంపీ జేసీ ధర్నా చేస్తున్న టెంట్ వైపు దూసుకొచ్చారు.

ఇలా సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎంపీ తీరు వివాదాస్ప‌దంగా మార‌డంతో సీఎం చంద్ర‌బాబు త‌ల‌ప‌ట్టుకున్న‌ట్లు జిల్లాలో లాండ్ అండ్ ఆర్డర్ సమస్య తలెత్తడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అధికార పార్టీ నేతలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటన యొక్క పూర్తి వివరాలు - ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ నివేదికను సీఎంకు అందచేశారు. చిన్నపోలమడ ఘర్షణలపై జిల్లా నేతలతో చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. మరో వైపు జేసీ బ్రదర్స్ వ్యవహార తీరు జిల్లాలో పార్టీ పరువు డ్యామేజ్ చేలా ఉందని ఆవేదన చెందుతున్నారు.కరువు జిల్లా అనంతపురంకు కియా వంటి పరిశ్రమ వ‌చ్చింద‌ని ప్ర‌చారం చేసుకుంటున్న స‌మ‌యంలో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై ఆయ‌న ఆవేద‌న చెందిన‌ట్లు స‌మాచారం. పార్టీలకు అతీతంగా పోలీసులు అక్కడ పరిస్థితులు అదుపులో ఉండేలా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చని సూచించిన‌ట్లు చెప్తున్నారు.