Begin typing your search above and press return to search.

మోడీ మీరు చూశారా? లోక్ సభలో పచ్చి వంకాయి కొరికిన మహిళా ఎంపీ

By:  Tupaki Desk   |   2 Aug 2022 4:36 AM GMT
మోడీ మీరు చూశారా? లోక్ సభలో పచ్చి వంకాయి కొరికిన మహిళా ఎంపీ
X
రోటీన్ కు భిన్నమైన సీన్ ఒకటి లోక్ సభలో చోటు చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా అధికారంలో ఉన్న మోడీ సర్కారు తీరుపై విపక్ష సభ్యులు విరుచుకుపడుతున్నారు. మోడీ సర్కారు విధానాలతో ధరలు మండిపోతున్నాయని.. గ్యాస్ బండను కొనుగోలు చేయటం కష్టంగా ఉందన్నఆగ్రహావేశాలు వ్యక్తం కావటం తెలిసిందే.

వర్షాకాల సమావేశాలు మొదలైన నాటి నుంచి విపక్ష సభ్యులు పలువురు పెరిగిన నిత్యవసర ధరల మీద నిరసన వ్యక్తం చేయటం.. జీఎస్టీ అంశాల్ని ప్రస్తావించి చేపట్టిన ఆందోళనతో వారు సస్పెండ్ కావటం తెలిసిందే. ఇలాంటివేళ.. కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయటంపై మండిపాటు వ్యక్తమైంది. ఇలాంటి వేళ.. నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తేశారు.

దీంతో.. విపక్షాలు కాస్తంత వెనక్కి తగ్గి.. తమ ఆందోళనను విరమించి.. లోక్ సభలో జరిగిన ధరల పెరుగుదల చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ అధికారపార్టీ అయిన టీఎంసీకి చెందిన కకోలీ ఘోష్ దస్తీదార్ అనూహ్య చర్య చేపట్టారు. ధరల పెరుగుదల మీద తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో..ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.

ఈ సందర్భంగా ఆమె తన వద్ద ఉన్న పచ్చి వంకాయిని చూపించి.. దాన్ని కొరికి చూపించారు. గ్యాస్ బండ ధరలు పెరిగిపోవటంతో సామాన్యులు వండుకోవటం చాలా కష్టంగా మారిందన్నారు. అందుకే.. తానిలా చేసినట్లుగా చెప్పిన ఆమె.. తక్కువ వ్యవధిలో నాలుగుసార్లు గ్యాస్ బండ ధరను పెంచారన్నారు. ఒకప్పుడు రూ.600 ఉన్న గ్యాస్ బండ ఇప్పుడు ఏకంగా రూ.1100లకు పెరిగిందన్నారు. దీంతో.. సామాన్యులకు కూర వండుకోవటం కూడా కష్టంగా మారిందన్నారు.

మోడీ సర్కారు తీరుతో పెరిగిన ధరలపై టీఎంసీ సభ్యురాలు వ్యవహరించిన తీరుపై లోక్ సభలో నవ్వులు పూశాయి.

పచ్చి వంకాయి కొరికి.. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆమె వ్యవహరించిన వైఖరిపై ప్రతిపక్ష నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సదరు ఎంపీ మాట్లాడుతూ.. గ్యాస్ బండ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెంపుపై టీఎంసీ ఎంపీ వంకాయ పర్వాన్ని మోడీ చూశారా? దేశంలో ఇప్పుడు చాలామంది ఇలాంటి ఆగ్రహంతోఉన్నారన్న విషయాన్ని ఆయన ఎప్పుడు గుర్తిస్తారో?