Begin typing your search above and press return to search.

చాలెంజ్‌ ను స్వీక‌రించిన క‌విత

By:  Tupaki Desk   |   20 Sep 2015 9:15 AM GMT
చాలెంజ్‌ ను స్వీక‌రించిన క‌విత
X
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై సీఎం కేసీఆర్ కుమార్తె - టీఆర్‌ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత భిన్న‌శైలిలో ముందుకు వెళ్లారు. రాజ‌కీయ నాయ‌కురాలిగా వ్య‌వ‌హ‌రిస్తూనే త‌న‌ నేతృత్వంలోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతుల కుటుంబాల‌ను ఆదుకోవాలంటూ పిలుపునిచ్చారు. అయితే ఈ క్ర‌మంలో ప‌లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. జాగృతి ద్వారా చేసిన సూచ‌న బాగానే ఉన్న‌ప్ప‌టికీ క‌వితే నేరుగా కుటుంబాల‌ను ఎందుకు ఆదుకోకూడ‌దు అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఎంపీ క‌విత కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జాగృతి ద్వారా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కుటుంబాల‌ను ఆదుకునే కార్య‌క్ర‌మానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో క్రీడాకారుల‌ను, ఎన్నారైల‌ను భాగ‌స్వామ్యం చేశారు.

తెలంగాణ జాగృతి తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులు గుత్తా జ్వాల - ప్రజ్ఞాన్ ఓజా - సానియా మీర్జా తల్లి తో క‌లిసి క‌విత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ...రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబ భారం రైతు భార్యపై పడుతుందని అన్నారు. కుటుంబ పెద్ద అయిన రైతు చనిపోతే పిల్లల చదువు, కుటుంబ భారం ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని, రైతు కుటుంబం బాధ్యతను, పిల్లల చదువుల బాధ్యతను తెలంగాణ జాగృతి తీసుకుంటుందని ప్ర‌క‌టించారు.

రైతు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం వ‌ల్ల ఆప‌ద‌లో ఉన్న రైతుల కుటుంబాలు వచ్చి తెలంగాణ జాగృతిని కలవాలని కోరారు. రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ జాగృతి తరపున కమిటీని వేశామన్నారు. ఇందు కోసం క్రీడాకారులు గుత్తా జ్వాల, సానియా మీర్జా, ప్రజ్ఞాన్ ఓజా వంటి క్రీడాకారులు, విదేశాల్లో ఉంటోన్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి లండన్ శాఖ, తెలంగాణ జాగృతి బహ్రెయిన్, తెలంగాణ జాగృతి అమెరికా శాఖలు రైతుల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చాయని వెల్లడించారు. మొత్తం 80 కుటుంబాల వరకు దత్తత తీసుకుంటామని జాగృతి సంస్థ‌ ముందుకొచ్చిందని పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి తెలంగాణ జాగృతి చేసే సహాయం రైతుల కుటుంబాలకు అందుతుందని వెల్లడించారు. ఆ రోజు నుంచి రైతు కుటుంబాలకు డబ్బు అందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన క్రీడాకారులకు, ఎన్‌ఆర్‌ఐలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

అవ‌స్థ‌ల్లో ఉన్న అన్న‌దాత‌ల కుటుంబాలను ఆదుకునేందుకు...స‌హాయం చేసేవారికి ఒక వేదిక‌గా ఉండేందుకు తెలంగాణ జాగృతిని వార‌ధిగా ఎంపీ క‌విత ఉప‌యోగించడం అభినంద‌నీయ‌మే.