Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం క‌విత ప్ర‌య‌త్నం

By:  Tupaki Desk   |   28 March 2018 6:24 AM GMT
కేసీఆర్ క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం క‌విత ప్ర‌య‌త్నం
X
టీఆర్ ఎస్ పార్టీ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి థ‌ర్డ్ ఫ్రంట్ పేరుతో కొత్త ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ స్థాయిలో చ‌క్రం తిప్పేందుకు సిద్ధ‌మైన కేసీఆర్ గుణాత్మ‌క రాజ‌కీయాల‌ను త‌న ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఒక‌రిద్ద‌రు నేత‌ల‌తో సంప్ర‌దించారు. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వ‌ద్ద‌కు స్వ‌యంగా వెళ్లి చ‌ర్చించారు. అయితే క్రియాశీల‌మైన మ‌రే ముంద‌డుగు ప‌డ‌క‌పోవ‌డంతో ఆయ‌న త‌న‌య‌ - ఎంపీ క‌విత రంగంలోకి దిగారు. తండ్రి ల‌క్ష్యాన్ని నెర‌వేర్చేందుకు త‌న‌వంతు స‌హాయాన్ని అందించే ప‌నులు మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలో దీదీతో మ‌ళ్లీ భేటీ అయ్యారు.

ఢిల్లీలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో పశ్చిమబెంగాల్‌ సిఎం మమతాబెనర్జీని ఎంపీలు కల్వకుంట్ల కవిత - బాల్క సుమన్‌ - కొత్త ప్రభాకర్‌ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నిక‌ల గురించి చ‌ర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని - ప్రాంతీయశక్తులే ప్రబల శక్తిగా రూపుదిద్దుకుంటాయని మ‌మ‌త చెప్పినట్లు తెలిసింది. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయ పడ్డట్లు సమాచారం. ఏప్రిల్‌ మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఢిల్లీ వస్తున్న విషయాన్ని నేతలు మమతకు వివరించారు.

మ‌రోవైపు తమిళనాడులో డీఎంకే - తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ మళ్ళీ అధికారం చేపట్టే అవకాశాలున్నాయని.. దేశంలో ప్రాంతీయశక్తులే వచ్చే ఎన్నికల లో ప్రబలశక్తిగా ఉంటాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు టీఆర్‌ ఎస్‌ నేతలలో ఉత్సాహాన్ని నింపాయి. జాతీయ రాజ‌కీయాల్లో టీఆర్ ఎస్ పార్టీ స‌త్తా చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు.