Begin typing your search above and press return to search.

తండ్రి పార్టీ ఆమెకి అత్తారిల్లు అయిందా?

By:  Tupaki Desk   |   5 Aug 2016 3:50 PM GMT
తండ్రి పార్టీ ఆమెకి అత్తారిల్లు అయిందా?
X
ఆచితూచి మాట్లాడ‌క‌పోతే అర్థాలు మారిపోతాయి! రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ఈ విష‌యాన్ని స‌ర్వ‌కాల స‌ర్వావ‌స్థ‌ల‌యందూ గుర్తుంచుకోవాలి. మీడియా ముందు మాట్లాడేట‌ప్పుడు ప్ర‌తీ ప‌దాన్నీ తూకం వేసి మాట్లాడాలి, లేదంటే ఇదిగో.. నిజామాబాద్ ఎంపీ క‌విత‌కు ఎదురైన‌ట్టు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ప‌ల‌క‌రిస్తాయి!

కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఓ మాట నోరు జారారు! అంతే, విలేక‌రులు ఆ మాట‌ను వెంట‌నే ప‌ట్టేసుకున్నారు. దాంతో ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో అని క‌వ‌ర్ చేసుకునేస‌రికి క‌విత‌కు చెమ‌ట‌లు ప‌ట్టినంత ప‌నైంద‌ని చెప్పుకుంటున్నారు! ఇంత‌కీ, క‌విత మాట్లాడింది ఏంటంటే... త‌న తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ త‌న‌కు అత్తారిల్లు లాంటిద‌ని ఆమె అన్నారు. ఇదేంటీ, తండ్రి పార్టీ అత్తారిల్లు ఎలా అవుతుందీ అనే అనుమానం ఎవరికైనా వ‌స్తుంది క‌దా. ఇక‌, మీడియాకు రాకుండా ఎలా ఉంటుంది. వెంట‌నే ఓ విలేక‌రి స్పందిస్తూ ‘ఏంటి మేడ‌మ్‌ - తెరాస‌లో మీరేమైనా ఇబ్బందులు ప‌డుతున్నారా’ అని ప్ర‌శ్నించేస‌రికి క‌విత అలెర్ట్ అయ్యారు. తెరాస అత్తారిల్లు అనే మాట కొంప‌ముంచేలా ఉంద‌ని వెంట‌నే వివ‌ర‌ణ ఇచ్చేశారు.

త‌న‌ను ప్ర‌జాజీవితానికి ద‌గ్గ‌ర చేసింది తెలంగాణ జాగృతి సంస్థ అనీ - దాని ద్వారానే ఎన్నో ఉద్య‌మాలు చేశాన‌నీ, కాబ‌ట్టి త‌న దృష్టిలో తెలంగాణ జాగృతి మాతృ పార్టీ అనే మీనింగ్‌ లో అలా మాట్లాడాన‌ని చెప్పారు క‌విత‌. త‌న‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది తెలంగాణ జాగృతి సంస్థ అనీ దాన్ని త‌న జీవితంలో ఎన్న‌టికీ మర‌చిపోలేన‌ని క‌విత వివ‌రించారు. ఆ త‌రువాత‌, తెరాస‌లో విలీనం అయింద‌నీ, తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎంపీగా గెలిచాన‌నీ, కాబ‌ట్టి ఆ విధంగా తన మాతృ సంస్థ అదే అనే ఉద్దేశంతో మాట్లాడాన‌ని చెప్పారు. తెరాస‌లో త‌న‌కు చాలా బాగుంద‌నీ, ఎలాంటి ఇబ్బందులేవ‌నీ ఈ అంశాన్ని ఇక్క‌డితో వ‌దిలేద్దాం అని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అలా ఫ్లోలో నోరు జారిన ఒక్క మాట‌ను క‌వ‌ర్ చేసుకునేందుకు క‌విత ఇంత వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది మ‌రి!