Begin typing your search above and press return to search.

దేశం కోస‌మే కేసీఆర్ ఫ్రంట్‌..టీడీపీ -వైసీపీనా తేల్చుకోలేదు

By:  Tupaki Desk   |   17 March 2018 4:48 PM GMT
దేశం కోస‌మే కేసీఆర్ ఫ్రంట్‌..టీడీపీ -వైసీపీనా తేల్చుకోలేదు
X
మార్పు దిశగా దేశాన్ని నడిపించేందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారని ఆయ‌న త‌న‌య‌, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్...రాజకీయ అంశం కాదు..ప్రజల ఆవసరాలు తీర్చుతూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకోసమేనని ఎంపి కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశ మంతా అమలు చేయాలన్నదే సీఎం లక్ష్యం అన్నారు. అంతే తప్ప పదవులకోసమో మరింకో దానికో కేసీఆర్ ప్రాకులాడరన్నారు. నల్సార్ యూనివర్సిటీ సెంటర్ ఫేర్ మేనేజ్ మెంట్ స్టడీస్ ( సి.ఎమ్.ఎస్) నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్ ప్రారంభ సెషన్ ముగిసిన తరువాత ఆమె మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

70 ఏళ్లలో దేశంలో జరగని అభివృద్ధి ని తెలంగాణ లో 3 ఏళ్ళలో సాధించామని తెలియజెప్పడంతో పాటు.. దేశమంతటా ఈ అభివృద్ది ఫలాలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమ‌ని ఎంపీ క‌విత అన్నారు. అందుకే రెండు పార్టీల పాల‌న‌కు భిన్నంగా ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసేందుకు కేసీఆర్ ఫ్రంట్ ఆలోచ‌న చేశారన్నారు. కాగా, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని ఎంపీ క‌విత పున‌రుద్ఘాటించారు. కేంద్రప్రభుత్వంపై టీడీపీ, వైసీపీలు త‌మ‌ను మ‌ద్ద‌తు కోరాన‌న్నారు. ఆ రెండు పార్టీల‌ అవిశ్వాసంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కవిత తెలిపారు.

కాగా, నల్సార్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (సిఎమ్ఎస్) ఆధ్వర్యంలో మహిళా లీడర్‌షిప్ సమ్మిట్ -2108 జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ..దక్షిణాసియాలో మహిళలు నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ మహిళలు పాలనలోను రాణించగరని నిరూపించారని ఎంపీ కవిత అన్నారు. మార్గరెట్ థాచర్ మహిళా నాయకులకు ప్రేరణ అన్నారు. తెలంగాణ - తమిళనాడు - యూపీ ల నుంచి ఎక్కువ మంది మహిళలు నాయకత్వ లక్షణాలతో దూసుకుపోతున్నారని తెలిపారు. వారసత్వం నుంచి వచ్చే మహిళలను ప్రశ్నిస్తున్నారు కానీ పురుషులను నిలదీయరా? అని ఆమె ప్రశ్నించారు. పురుష నాయకులు మహిళల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకుని మార్చి నెలలో సభలు - సమావేశాలు జరుగుతున్నాయని, వీటిలో మహిళల సమస్యలు - పరిష్కారం పై చర్చ జరుగుతున్నదని,అయితే సంవత్సరం పొడుగునా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. మహిళా నాయకత్వం - సాధికారత - అక్షరాస్యత వంటి అంశాలపై విస్తృత చర్చ జరిపి మహిళల్లో అవగాహన పెంపొందిస్తూ చైతన్యం తీసుకురావాలని కోరారు.