Begin typing your search above and press return to search.

నా ఫుల్ సపోర్టు మీకే అంటున్న కవిత

By:  Tupaki Desk   |   18 Aug 2016 2:28 PM GMT
నా ఫుల్ సపోర్టు మీకే అంటున్న కవిత
X
ఏపీ ప్రత్యేక హోదాకు అనుకోని రీతిలో పోటీ రాష్ట్రం తెలంగాణ నుంచి మద్దతు దొరికింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు తన మద్దతు ఉంటుందని కవిత తెలిపారు. లోక్‌సభలోనూ ఈ విషయంలో ఏపీకి తాను మద్దతిస్తానని చెప్పారు. రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన మాటకే విలువ లేకుండాపోతే ఎలా అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని తప్పించుకోవడం సరికాదని కేంద్రానికి చురకలేశారు. అభ్యంతరాలుంటే అన్ని రాష్ట్రాలను కూర్చోబెట్టి పరిష్కరించుకోవచ్చని కూడా సూచించారు.

గురువారం కృష్టా జిల్లా నందిగామలో ఒక కార్యక్రమానికి హాజరైన కవిత అక్కడ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ఎన్డీయే సర్కారు మీద ఉందని ఆమె స్పష్టంగా చెప్పారు. నిబంధనల ప్రకారం సాధ్యం కాకపోతే రాజకీయ నిర్ణయం తీసుకునైనా హోదా ఇవ్వాలని ఆమె అన్నారు. పార్లమెంటులో ఈ విషయంపై ఏపీ ఎంపీలకు మద్దతు పలుకుతామని కూడా చెప్పారు.

అయితే.. తెలంగాణ ఉద్యమంలో ఏపీ పేరెత్తితే విరుచుకుపడే కవిత ఇప్పుడు ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు.. ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన ప్రాంతాన్ని బట్టి కూడా ఆమె మాటల్లో నిజాయితీ ఎంతన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోకి వచ్చిన సందర్భంగా ఇలా మాట్లాడిన ఆమె సొంత రాష్ట్రానికి వెళ్లాక ఈ మాటలకు కట్టుబడి ఉంటారో లేదో చూడాలి. ఇదంతా ఎలా ఉన్నా రాజకీయంగా, విభజన సమస్యల పరంగా తరచూ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు జరుగుతున్న తరుణంలో కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం ఏపీ ప్రజలను ఆకట్టుకున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు.