Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌లోకి ఎంపీ గీత‌?..అందుకేనా ఇలా?!

By:  Tupaki Desk   |   25 Nov 2017 6:16 AM GMT
జ‌న‌సేన‌లోకి ఎంపీ గీత‌?..అందుకేనా ఇలా?!
X
ఏపీ విప‌క్ష పార్టీ వైసీపీ నుంచి 2014 ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన అర‌కు పార్ల‌మెంటు స‌భ్యురాలు కొత్త‌ప‌ల్లి గీత ఎట్ట‌కేల‌కు మౌనం వీడారు. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని పొలిటిక‌ల్ కామెంట్లు కుమ్మ‌రించారు. అప్ప‌ట్లో ఎంపీగా గెలిచిన త‌ర్వాత ఆమె వైసీపీకి దూర‌మ‌య్యారు. పార్టీ కండువా క‌ప్పుకొని ఓట్లు వేయించుకున్న ఆమె ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వ‌చ్చిన 48 గంట‌ల్లోనే ప్లేట్ ఫిరాయించాల‌ని ప్ర‌య‌త్నించారు. దీనిలో భాగంగానే ఆమె వైసీపీ కండువాను క‌ప్పుకోవ‌డం మానేశారు. అయితే, అప్ప‌ట్లో ఆమె ప్ర‌య‌త్నించినా టీడీపీలో ఎందుకోగానీ ఎంట్రీ దొర‌క‌లేదు. దీంతో ఆమె సైలెంట్ అయిపోయారు. అయితే, అడ‌పా ద‌డ‌పా టీడీపీ ఎంపీల‌తో పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో మీడియాకు క‌నిపించి ఆశ్చ‌ర్యానికి గురి చేసేవారు.

దీనిపై ప్ర‌శ్నించాల‌ని మీడియా ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఆమె అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇక‌, 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఆమె ఇటీవ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై నోరు పారేసుకున్నారు. పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేరని, అది మూర్ఖత్వమేనని మండిపడ్డారు. జగన్ పాదయాత్ర ఓ పొలిటికల్ స్టంట్ అన్నారు. ఇక, ఇప్పుడు తాను ఏ పార్టీలోనూ లేన‌ని, ప్ర‌స్తుతం ఇండిపెండెంట్‌గా ఉన్నాన‌ని ఆమె చెప్పుకొచ్చారు. చాలామంది ఎంపీలకు బెదిరింపు లేఖలు వస్తున్నాయని, ఈ అంశంపై రాబోయే శీతాకాల సమావేశాల్లో ప్రయివెంటు మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని అన్నారు.

ఇక‌, గతంలో హైదరాబాదులో వందల కోట్ల భూకుంభకోణం - కులవివాదం - ఫిరాయింపు.. ఇలా ఇబ్బందులు ఎదుర్కొన్న కొత్తపల్లి గీతకు మరో షాక్ తగిలింది. 'ఇటీవల మీరు కొన్న బంగారం నకిలీదని తేలింది. ఏసీబీ మీపై కేసు దాఖలు చేసింది. ఆ దస్త్రం కావాలంటే ఈ ఖాతాలో సొమ్ములు వేయండం'టూ తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ మెయిల్‌ వచ్చిందని ఆమె చెప్పారు. ఎస్బీఐ ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు గీత తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే విశాఖపట్నంలో ఫిర్యాదు చేశానన్నారు. గతంలో తన కుమారుడు కార్డు నుంచి రూ.12 వేలు తస్కరించారని ఢిల్లీలో ఫిర్యాదు చేసి 8 నెలలైనా పురోగతి లేదన్నారు. సో.. ఇవి ఎలా ఉన్నా.. రాజ‌కీయంగా గీత ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు ఇలా జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ‌డం, తాను ఇండిపెండెంట్‌నేన‌ని కామెంట్లు చేయ‌డం పూర్తిగా ఆమె 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మొత్తానికి గీత వ్యూహం, టార్గెట్ అంతా జ‌న‌సేన‌లో చేరేందుకేన‌నే సందేహం ఉంద‌ని కూడా అంటున్నారు. మ‌రి గీత ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటుందో చూడాలి.