Begin typing your search above and press return to search.

ఎంపీ కేవీపీ ఇంట్లో దొంగతనం

By:  Tupaki Desk   |   31 May 2022 8:30 AM GMT
ఎంపీ కేవీపీ ఇంట్లో దొంగతనం
X
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో దొంగలు పడ్డారు. ఆయన ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ.46 లక్షలు విలువ చేసే 49 గ్రాముల డైమండ్ నెక్లెస్ పోయింది. ఈ మేరకు కేవీపీ రామచంద్రరావు సతీమణి సునీత హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా కేవీపీ రామచంద్రరావు హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో నివాసముంటున్నారు.

తనకు తెలుగు రంగు డైమండ్ నెక్లెస్ ఉందని.. దీన్ని ధరించి తాను మే 11న ఓ ఫంక్షన్ కు హాజరయ్యానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కేవీపీ సతీమణి సునీత పేర్కొన్నారు. ఇంటికి తిరిగొచ్చిన కాసేపటి తర్వాత దాన్ని బెడ్ రూములో ఉన్న బీరువాలో పెట్టానని తెలిపారు. తాజాగా బీరువా తీసి చూసుకుంటే నెక్లెస్ కనిపించడం లేదన్నారు. దీంతో ఇళ్లంతా వెతికానని చెప్పారు. పని మనుషులపైనే తనకు అనుమానం ఉందని ఆమె పోలీసులకు వివరించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు.

వాస్తవానికి కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండటంతో ఆయన ఇంటికి భారీ భద్రత ఉంది. అందులోనూ బంజారా హిల్స్ లో సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన బడా బాబులు నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు కూడా ఎక్కువే.

మరి ఈ నేపథ్యంలో ఇలాంటి బందోబస్తును కూడా ఛేదించుకుని ఈ దొంగతనం చేయడంపై పోలీసులు కూడా విస్తుపోతున్నారు. ఈ దొంగతనానికి పాల్పడింది పని మనుషులు అయినా కావచ్చు లేదా ఇలాంటి నేరాల్లో ఆరితేరిన అంతర్రాష్ట్ర దొంగలు అయినా కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిగా ఆత్మగా ఉన్న కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం వరుసగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభలో రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 వరకు ఆయన పదవీ కాలం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004- 2009 వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు ఆయన అనుంగు ప్రాణ మిత్రుడిగా చక్రం తిప్పారు. వైఎస్సార్ తరఫు అన్ని వ్యవహారాలను చక్కబెట్టేవారు. అప్పట్లో మొదటిసారి రాజ్యసభకు ఎంపికైన ఆయన వైఎస్సార్ మరణం తర్వాత కూడా మరోసారి రాజ్యసభ బెర్తును దక్కించుకున్నారు.

వైఎస్సార్ మరణించినప్పటి నుంచి కేవీపీ రామచంద్రరావు రాజకీయాల్లో అంత క్రియాశీలకంగా లేరు. తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు అస్సలు రావడం మానేశారు. ఇక 2014లో ఆంధ్రప్రదేశ్ ను విభజించాక ఏపీలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో కేవీపీ యాక్టివ్ రాజకీయాలను పూర్తిగా తగ్గించేశారు. కాగా కేవీపీ రామచంద్రరావు స్వగ్రామం కృష్ణా జిల్లాలోని అంపాపురం.