Begin typing your search above and press return to search.

రఘురామకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వార్నింగ్? ఇచ్చింది ఆ ఎంపీనేట!

By:  Tupaki Desk   |   4 Aug 2021 4:28 AM GMT
రఘురామకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వార్నింగ్? ఇచ్చింది ఆ ఎంపీనేట!
X
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ కమ్ ఫైర్ బ్రాండ్ తాజాగా మరో కంప్లైంట్ ను తెర మీదకు తీసుకొచ్చారు. సొంత పార్టీ మీద నిత్యం ఏదో ఒక విమర్శ.. ఆరోపణ చేసే ఆయన.. తాజాగా తమ పార్టీకే చెందిన ఎంపీ ఒకరు తనను బెదిరించారని..పార్లమెంటు సెంట్రల్ హాల్లో చోటు చేసుకున్న ఈ వైనంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతలకు.. ఎంపీ రఘురామకు పడని విషయం తెలిసిందే. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఆయన వ్యవహరించే తీరుపై పలువురు మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. మంగళవారం ఉదయం 11.50 గంటలకు లోక్ సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు సెంట్రల్ మాల్లో ఉన్న తన వద్దకు ఎంపీ మాధవ్ వచ్చారన్నారు. రావటంతోనే అసభ్య పదజాలంతో దూషించారని.. మరోసారి టీవీల్లో కనిపిస్తే అంతం చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. ఎంపీ మాధవ్ తన వద్దకు రావటానికి ముందు తమ పార్టీ ఎంపీల వద్ద కూర్చున్నారని.. బహుశా వారు రెచ్చగొట్టటంతోనే ఆయనలా చేసి ఉంటారన్న వ్యాఖ్య చేయటం గమనార్హం.

తనను బెదిరించిన వైనం పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని సీసీ కెమేరాల ఫుటేజ్ ను పరిశీలిస్తే అసలు విషయం ఇట్టే తెలిసిపోతుందన్నారు. తనను బెదిరించిన వైనంపై ప్రధాని నరేంద్ర మోడీకి.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన కంప్లైంట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన మాధవ్ తనను బెదిరించారని.. ఆయన నుంచి ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. అందుకే తగిన రక్షణ కల్పించాలన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎంపీ మాధవ్ పై చర్యలు తీసుకోవాలని లేఖలో రఘురామ కోరారు. మరి.. తాజా కంప్లైంట్ పై ఏం చేస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. సొంత పార్టీ అధినేతకు.. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉండే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశారు ఎంపీ రఘురామ. తాజాగా ఆయనపై ఉన్నఅక్రమాస్తుల కేసులో ఎ2గా ఉన్న విజయసాయి బెయిల్ ను రద్దు చేయాలన్నారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న జగన్.. సాయి రెడ్డి ప్రజా వ్యతిరేక చర్యలతో నిరంకుశంగా వ్యవహరిస్తూ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వర్గాల మీడియాను నియంత్రిస్తున్నారని.. వీరిపై కేసుల సత్వర విచారణ జరగాలంటే వీరు జైల్లో ఉండాలన్న వైనం ఆసక్తికరంగా మారింది. ఇలా వరుస పెట్టి కంప్లైంట్లు ఇస్తున్న రఘురామ తీరు.. జగన్ అండ్ కోకు రానున్న రోజుల్లో మరెన్ని ఇబ్బందులకు గురి చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.