Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ ఆటో డ్రైవరయ్యారు

By:  Tupaki Desk   |   4 Oct 2016 7:48 AM GMT
ఆ ఎంపీ ఆటో డ్రైవరయ్యారు
X
ఏలూరు ఎంపి మాగంటి బాబు అప్పుడప్పుడు షో మ్యాన్ లా మారి అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఆయన ఆటో డ్రైవర్‌గా మారి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఏలూరు జడ్పీ కార్యాలయంలో పేదలకు ఆటోల పంపిణీ చేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. అది ముగిసిన తరువాత మాగంటి బాబు హల్ చల్ చేశారు. ఒక ఆటోను తీసుకుని తానే స్వయంగా నడిపారు. అంతేకాదు... అందులో ఎక్కాలని జిల్లా కలెక్టర్ భాస్కర్ - ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ లను పిలిచారు. దీంతో వారు ఎంపీ నడుపుతున్న ఆటోలో ఎక్కారు. వారితో పాటు మహిళా ఎంపీపీలు - జడ్పీటీసీలు కూడా మాగంటి ఆటోలో ఎక్కారు. వారందరినీ ఎక్కించుకుని రెండు మూడు రౌండ్లు కొట్టిన మాంగంటి బాబు అచ్చం ఆటో డ్రైవర్లా ఇరగదీసేశారు.

అయితే.. ఆటో దిగిన తరువాత మాగంటి బాబు తెగ సంతోషించారట. కారణమేంటంటే కలెక్టరు భాస్కర్ ను తన ఆటోలో తీసుకెళ్లే అదృష్టం దక్కిందంటూ ఆయన తెగ మురిసిపోయారట. ఆయన మురిసిపోవడం ఒక్కెత్తయితే.. ఆ ఛాన్సు తనకు ఇవ్వకుండా మాగంటి కొట్టేశారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫీలవడం ఇంకో ఎత్తు. ఇంతకీ ఒక ఎంపీ, ఎమ్మెల్యే కలిసి కలెక్టరు ప్రాపకం కోసం అంతగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకా అంటే దానికీ కారణాలు చెబుతున్నాయి రాజకీయ, ఉద్యోగ వర్గాలు. పశ్చిమ కలెక్టరు భాస్కర్ చంద్రబాబుకు సమీప బంధువని చెబుతుంటారు. దీంతో ఆయన, టీడీపీ నేతలతో కలిసి తనకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు గొడవ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేలు కలెక్టరును ఆటో ఎక్కించి తిప్పి సరదా పడడంలో వింతేమీ లేదు.