Begin typing your search above and press return to search.

పేరు చెప్పడానికి ఆ ఎంపీకి సిగ్గేసింది!

By:  Tupaki Desk   |   8 Sep 2016 5:48 AM GMT
పేరు చెప్పడానికి ఆ ఎంపీకి సిగ్గేసింది!
X
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ చాలా మోసపూరితంగా , తెలుగు ప్రజలకు ద్రోహం చేసేదిలా ఉన్నదంటూ.. ఒకవైపు తీవ్రమైన నిరసనజ్వాలలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. అయితే కేంద్రానికి భజన చేయడం తద్వారా తన వ్యాపార ప్రయోజనాలను నెరవేర్చుకోవడం బాగా అలవాటు అయిపోయిన ఓ తెలుగుదేశం ఎంపీకి మాత్రం అరుణ్‌ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ చాలా తీయగా కనిపించిందిట. ఈ ప్యాకేజీ వల్ల ఏపీకి అయిదేళ్లలో లక్షన్నర కోట్ల ప్రయోజనం కలుగుతుందని ఆయన లెక్కలు కట్టి మరీ మీడియా వారికి ఉప్పందించాట్ట.

విషయం ఏంటంటే.. మోడీ సర్కారు తాము 'నిరంతరాయంగా' సాయం చేస్తూనే ఉంటాం అని చెబుతున్న ప్యాకేజీ కింద అయిదేళ్లలో అంతా అనుకున్నట్లు సాగితే లక్షన్నర కోట్లు ప్రయోజనం కలుగుతుందేమో.. కానీ.. ఆ సర్కారుకు ఆయువు ఉన్నది ఇంకా రెండున్నరేళ్లు మాత్రమే. ఆ తర్వాత.. ప్రభుత్వం కూలిపోతే ఏమిటి పరిస్థితి? ఇదొక వైపరీత్యం అయితే.. అసలు ప్యాకేజీ అనేదే మోసపూరితంగా ఉన్నదంటూ జనం విలపిస్తున్న సమయంలో.. అదే బ్రహ్మాండం అన్నట్లుగా తెదేపా ఎంపీ మీడియా వారికి తప్పుడు లెక్కలతో లీకులు ఇవ్వడం మాత్రం తీవ్రమైన చర్యగా జనం భావిస్తున్నారు.

ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. లెక్కలు కట్టి లక్షన్నర కోట్ల ప్రయోజనాలు తేల్చిన సదరు ఎంపీ.. తన పేరు ప్రచురించవద్దని మీడియా వారిని కోరడం. బుధవారం మొత్తం కేంద్ర మంత్రులతో చర్చలతో తాను కూడా పాల్గొన్న ఆ ఎంపీ.. తన పేరు బయటకు వస్తే జనం ఛీ కొడతారని భయపడినట్లుందని జనం అనుకుంటున్నారు.