Begin typing your search above and press return to search.

ఆ ఎంపీకి కేసీఆర్ కంటే కేటీఆర్ అంటేనే గురా?

By:  Tupaki Desk   |   18 Jan 2016 4:51 AM GMT
ఆ ఎంపీకి కేసీఆర్ కంటే కేటీఆర్ అంటేనే గురా?
X
విధేయత రాజకీయాల్లో ఎంతగా పని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రాజకీయాల్లో పైకి ఎదగాలంటే ఏమున్నా లేకున్నా.. విధేయత మాత్రం చాలా చాలా అవసరం. ఈ విషయాన్ని గుర్తించి.. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించిన వారంతా తగిన ప్రయోజనాన్ని పొందారు. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. టీఆర్ ఎస్ పార్టీ నేతల్లో ఎవరైనా సరే కేసీఆర్ కు విదేయతగా ఉంటారా? కేటీఆర్ కు విధేయతగా ఉంటారా? అన్న ప్రశ్న వేస్తే.. మరో ఆలోచన లేకుండా కేసీఆర్ పేరే చెబుతారు. కానీ ఒక యువ ఎంపీ మాత్రం అందుకు భిన్నంగా కేటీఆర్ స్తోత్రం చేయటం ఆసక్తికరంగా మారింది.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు వెళ్లిన ఒక యువ ఎంపీ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పార్టీ అధినేత కంటే కూడా.. ఆయన పుత్రరత్నానికే తన ఓటు అంటూ కేటీఆర్ మీదున్న భక్తిని పబ్లిక్ గా చాటుకుంటున్న అతగాడి తీరును చూసి విస్మయం చెందుతున్నారు. రాజకీయాల్లో భజన మామూలే అయినా.. ఓ రేంజ్ లో తనకున్న భక్తిని ప్రకటిస్తున్న సదరు ఎంపీ భజన ఆసక్తికరంగా మారింది.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో చంద్రబాబుతో కేసీఆర్ ఏం మాట్లాడారన్న సందేహాన్ని తీర్చుకోవటానికి మీడియా ప్రతినిధులు సదరు ఎంపీతో ముచ్చట్లు పెట్టారు. తమ ప్రశ్నలతో మీడియా ప్రతినిధుల నుంచి తప్పించుకునేందుకు.. అలాంటి విషయాలు బయటకు చెప్పటం ధర్మం కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. సదరు యువ ఎంపీని మీడియా ప్రతినిధులు మొహమాటానికి గురి చేయటంతో అతగాడు విధేయత అస్త్రాన్ని బయటకు తీశారు.

కేసీఆర్ తో చంద్రబాబు ముచ్చట్లు గురించి తాను చెబుతానని కాకుంటే పార్టీ విడిచిపెట్టిన తర్వాతే అంటూ తప్పించుకోబోయి.. మరి.. పార్టీ ఎప్పుడు విడిచి పెడతావన్న ప్రశ్నకు.. కేటీఆర్ ఎప్పుడు పార్టీ వదిలేస్తే తాను అప్పుడే వదిలేస్తానని చెప్పుకొచ్చారు. సదరు యువ ఎంపీ చమత్కారం.. తెలివి తేటలు.. కేటీఆర్ మీద తనకున్న భక్తిని ప్రదర్శించేందుకు పడిన తాపత్రయం చూసి.. యువ ఎంపీకి మాంచి భవిష్యత్తు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.