Begin typing your search above and press return to search.

ఎంపి ఏమి చేయబోతున్నారో ?

By:  Tupaki Desk   |   5 Jun 2021 2:30 PM GMT
ఎంపి ఏమి చేయబోతున్నారో ?
X
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు పార్లమెంటులోని వివిధ పార్టీల ఎంపిలందరికీ లేఖలు రాశారు. తనను సీఐడీ అరెస్టు చేసిన తర్వాత థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఒక ఎంపిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించటం ఇదే మొదటిసారిగా రఘురామ తన లేఖలో ప్రస్తావించారు. తన అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలను ఎంపి లేఖలో పూసగుచ్చినట్లు వివరించారు.

అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను కోర్టులో పిటీషన్ వేసిన కారణంగానే తనపై కక్ష పెట్టుకుని సీఐడీ పోలీసులతో కేసులు పెట్టించినట్లు ఎంపి ఆరోపించారు. ఇదే విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసినపుడు కూడా ఎంపి ఫిర్యాదుచేశారు. జగన్ తో పాటు డీజీపీ, సీఐడీ అడిషినల్ డీజీ సునీల్ కుమార్, ఏఎస్పీ విజయపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎంపి కోణంలో సహచర ఎంపిలకు లేఖలు రాయటం, స్పీకర్ కు ఫిర్యాదు చేయటం వరకు బాగానే ఉంది. అయితే రఘురామ గెలిచింది వైసీపీ గుర్తుమీదన్న విషయం అందరికీ తెలిసిందే. గెలిచిన వెంటనే జగన్ తో గొడవైన కారణంగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. అక్కడి నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపి ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంతా ఎంపి ఎన్ని విమర్శలు చేసినా ఎంపికి వ్యతిరేకంగా జగన్ ఎక్కడా నోరిప్పలేదన్నది వాస్తవం. తర్వాత కొంతకాలానికి ప్రభుత్వాన్ని విమర్శించటంతో పాటు జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మొదలుపెట్టారు ఎంపి. దాంతోనే సమస్య ముదిరిపోయి చివరకు ఎంపి అరెస్టుకు దారితీసింది. తనను కొట్టారని ఎంపి ఆరోపిస్తుంటే తాము కొట్టలేదని సీఐడీ అంటోంది. ఇపుడీ వివాదమే కోర్టులో నడుస్తోంది.

సరే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే పార్లమెంటులో పార్టీలకు అతీతంగా తనకు మద్దతు ఇవ్వాలని ఎంపిలకు లేఖలు రాయటంలో ఉద్దేశ్యం ఏమిటి ? ఒక రాష్ట్రప్రభుత్వంపై పార్లమెంటు కానీ స్పీకర్ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశంలేదు. ఎంపి వైఖరి చూస్తుంటే జగన్ కు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రస్తావన తెచ్చేట్లున్నారు. మరి ఏ పార్టీ ఎంపి హోదాలో సీఎంకు వ్యతిరేకంగా ప్రస్తావన తేబోతున్నారో అర్ధం కావటంలేదు. మొత్తంమీద ఎంపి చర్యలైతే ఆసక్తిగానే ఉంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.