Begin typing your search above and press return to search.

ఎంపి చెప్పినట్లే జరిగిందా ?

By:  Tupaki Desk   |   16 Sep 2021 5:35 AM GMT
ఎంపి చెప్పినట్లే జరిగిందా ?
X
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు గతంలో చెప్పినట్లు న్యాయమే గెలిచింది. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపి వేసిన పిటీషన్ను సీబీఐ న్యాయస్ధానం కొట్టేసింది. గతంలో తన పిటీషన్ విచారణ సందర్భంగా ఎంపి మాట్లాడుతు జగన్, విజయసాయి బెయిల్ రద్దవ్వటం ఖాయమన్నారు. వాళ్ళిద్దరి తిరిగి జైలుకు వెళ్ళక తప్పదన్నారు. భగవంతుడి దయవల్ల బెయిల్ రద్దు విషయంలో న్యాయమే గెలుస్తుందని తనకు విశ్వాసం ఉందని చాలా గట్టిగా చెప్పారు.

తాజాగా ఎంపి పిటీషన్ను కోర్టు కొట్టేయటంతో న్యాయమే గెలిచినట్లు భావించాలి. జగన్, విజయసాయి బెయిల్ రద్దు విషయంలో ఎంపి అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా ఎంపి వేసిన పిటీషన్లో ఎలాంటి పసలేదని ముందే తెలుసు. నిజానికి తాను వేసిన కేసులో వాళ్ళిద్దరి బెయిల్ రద్దుకాదని బహుశా తిరుగుబాటు ఎంపికి కూడా తెలిసే ఉంటుంది. అయినా ఎందుకు వేశారంటే జగన్+విజయసాయి పై వీలైనంత బురదచల్లటమే టార్గెట్ అంతే.

ఎంపి చేసిన ఓవర్ యాక్షన్ను జగన్ వ్యతిరేక మీడియా బాగా హైలైట్ చేసింది. అసలు జగన్ కేసులతో ఎంపికి ఎలాంటి సంబంధంలేదు. జగన్ కేసుల్లో ఎంపి బాధితుడూ కాదు కనీసం సాక్షి కూడా కాదు. అయినా సీఎం హోదాలో జగన్ సాక్షులను భయపెడుతున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారంటు నానా రచ్చచేశారు. జగన్ బెయిల్ విషయంలో ఏమైనా అభ్యంతరాలు చెప్పాలంటే అది సీబీఐ చెప్పాలి. కానీ సీబీఐ ఏమీ అభ్యంతరం చెప్పకపోయినా ఎంపికి ఏమి అభ్యంతరం వచ్చిందో తెలీటంలేదు. విచారణలో జగన్, విజయసాయి బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని సీబీఐ చెప్పింది.

జగన్ పై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు ఎలా రాజకీయ ప్రేరేపితమో బెయిల్ రద్దు చేయాలని ఎంపి వేసిన పిటీషన్ కూడా అంతే రాజకీయ ప్రేరేపితం అని తేలిపోయింది. ఎంపితో కలిసి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటీషన్ వేసినట్లు వైసీపీ నేతలు ఇఫ్పటికే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు కేసు వేయటమే విచిత్రమనుకుంటే తీర్పు చెప్పకుండా అడ్డుకోవాలని, కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం మరింత విచిత్రం.

మొత్తానికి జగన్ బెయిల్ రద్దు పిటీషన్ను సీబీఐ కోర్టు కొట్టేయడంతో హైకోర్టులో చాలెంజ్ చేయబోతున్నట్లు రఘురామ చెప్పటం గమనార్హం. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే ఎంపి చెప్పారు. దీనిబట్టి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్ కొట్టేస్తారనే అనుమానం ఎంపికి ఉన్నట్లు అర్ధమవుతోంది. ఒకవేళ హైకోర్టులో పిటిషన్ కొట్టి వేస్తే వెంటనే సుప్రింకోర్టుకు వెళతామని చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అంటే జగన్ను రాజకీయంగా ఏదో ఇబ్బంది పెడదామనే ఆలోచనే తప్ప మరేమీ లేదని అర్ధమైపోతోంది. మరి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.