Begin typing your search above and press return to search.

బెయిల్ రద్దు పిటిషన్ పై జగన్ మాటకు రఘురామ రియాక్షన్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   2 Jun 2021 4:46 AM GMT
బెయిల్ రద్దు పిటిషన్ పై జగన్ మాటకు రఘురామ రియాక్షన్ వచ్చేసింది
X
జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. ఆయనకు కోర్టు ఇచ్చిన బెయిల్ ను కొట్టేయాలంటూ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై జగన్మోహన్ రెడ్డి తాజాగా తన వాదనను కౌంటర్ రూపంలో తన తరఫు న్యాయవాదితో కోర్టులో దాఖలు చేశారు. ఈ సందర్భంగా రఘురామపై కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.947.71 కోట్ల బ్యాంకు సొమ్మును పక్కదారి పట్టించిన వ్యవహారంలో రఘురామపై కేసు నమోదైందని.. రూ.237 కోట్ల మేర బ్యాంకుల్ని మోసం చేసి.. పక్కదారి పట్టించిన మరో కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారని.. ఇవి కాకుండా మరో ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పారు.

రఘురామ దుష్ప్రవర్తన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని గత జులైలో స్పీకర్ కు వైసీపీ లేఖ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. రాజకీయ లక్ష్యాల కోసం న్యాయ ప్రక్రియను రఘురామ వాడుకోవాలని ఆరోపించారు. ఈ ఆరోపణలపై రఘురామ స్పందించారు. తాను ఏ కేసులోనూ దోషిని కాదని.. కనీసం ఛార్జ్ షీట్ లేనందున బెయిల్ రద్దు పిటిషన్ వేసే హక్కు తనకుందన్నారు.

పలు ఎఫ్ఐఆర్ లలో పేరున్న వ్యక్తి.. వేరొకరి బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలు చేయటం ఏమిటని ప్రశ్నించిన ఆయన.. జగన్ కౌంటర్ హాస్యస్పదంగా ఉందన్నారు. జగన్ కౌంటర్ కు వారంలో సమాధానం ఇస్తానని చెప్పారు రఘురామ. తాను ఏ విధంగా అయితే ఏ కేసులోనూ దోషిని కాదని రఘురామ చెప్పుకున్నారో.. ఆ మాటకు వస్తే జగన్ మీద నమోదైన ఏ కేసులోనూ ఆయన దోషిగా తేలలేదన్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు రఘురామ అదే పనిగా విమర్శలు చేయటం సరికాదన్నది మర్చిపోకూడదు. వేలెత్తి చూపించే వేళలో.. ఒకటి ఎదుటోళ్ల వైపు చూపిస్తే.. మిగిలిన వేళ్లు తనను చూపిస్తాయన్న కనీస విషయాన్ని రఘురా మిస్ కావటం ఏమిటి?