Begin typing your search above and press return to search.

జగన్ ను మళ్లీ టార్గెట్ చేసిన ఎంపీ రఘురామ

By:  Tupaki Desk   |   27 Jun 2021 9:34 AM GMT
జగన్ ను మళ్లీ టార్గెట్ చేసిన ఎంపీ రఘురామ
X
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎంతకూ తగ్గడం లేదు. సీఎం జగన్ ప్రభుత్వ లోపాలపై వరుసగా లేఖలు రాస్తూ హీటెక్కిస్తున్నాడు. సీఎం జగన్ కు కొన్ని రోజులుగా వరుసగా వేర్వేరు అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై లేఖలను రాస్తున్నారు. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. సర్పంచులు, ఉప సర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ కు సంబంధించి ప్రశ్నించారు. గ్రామస్థాయిలో పరిపాలనను బలోపేతం చేయడానికి సర్పంచ్, ఉప సర్పంచ్ లకు ఉమ్మడిగా చెక్ పవర్ ను కల్పించాలంటూ జగన్ కు లేఖలో కోరారు. జాతిపిత మహాత్మాగాంధీ సూక్తులను వల్లెవేశారు. మహాత్ముడి గ్రామస్వరాజ్యాన్ని కల్లకు కట్టాలని సూచించారు.

పంచాయతీరాజ్ 73వ సవరణ చట్టానికి విరుద్ధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రఘురామ ఆరోపించారు. జీవోనంబర్ 2 దీనికి పూర్తి భిన్నమని విమర్శించారు. జీవోనంబర్ 2ను తీసుకొని రావడం పంచాయతీరాజ్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తారు. ఇది ప్రజల ద్వారా ఎన్నుకొన్న సర్పంచ్ వ్యవస్థను అవమానించినట్టేనని రఘురామ చెప్పారు.

సర్పంచ్, ఉప సర్పంచ్ లకు పనిచేసే స్వేచ్ఛను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని..దీనికి అడ్డుగా ఉంటోన్న జీవోనంబర్ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ , ఉప సర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ ను కల్పించాలని రఘురామ లేఖలో డిమాండ్ చేశారు. ఈ రెండు చర్యల ద్వారా గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పరిపాలనను పునరుద్దరించినట్టు అవుతుందని చెప్పారు. ఈ చర్యలు ఎంత త్వరగా తీసుకుంటే ప్రజాస్వామ్యానికి అంత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.