Begin typing your search above and press return to search.

ఎంపీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   29 Oct 2021 1:30 PM GMT
ఎంపీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
X
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం చాలా ఓవర్ గా ఉందనే అనిపిస్తోంది. ఈయనకు సంబంధంలేని విషయాల్లో కూడా వేలుపెట్టి ప్రభుత్వాన్ని లేదా పోలీసులను గబ్బుపట్టించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమైపోతోంది. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతు కస్టడీలో టీడీపీ నేత పట్టాభిని కొట్టారంటే ఆధారాలు లేని ఆరోపణలతో ఎంపీ గోల మొదలుపెట్టారు. పట్టాభిని కొట్టారా లేదా అన్న విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పాలట.

టీడీపీ నేతను కొట్టారనేందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్లు ఎంపీ చెప్పటమే విచిత్రంగా ఉంది. ఏపీలో ప్రభుత్వానికి, పోలీసులకు తేడాలేదట. తనకు పోలీసులంటే గౌరవం ఉన్నా కొందరి పోలీసుల వల్లే మొత్త పోలీసు వ్యవస్ధకే చెడ్డపేరు వస్తోందని తెగ బాధపడిపోయారు. నిజానికి టీడీపీ వ్యవహారాలతో ఎంపీకి ఎలాంటి సంబంధమూ లేదు. కానీ తనకు సంబంధం ఉందని లేదని అన్న పట్టింపు లేకుండా ప్రభుత్వాన్ని గబ్బుపట్టించే అవకాశం ఉందంటే చాలు రంగంలోకి దూకేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే తాను చెప్పేది జనాలు ఎవరైనా నమ్ముతున్నారా లేదా అని కూడా ఎంపీ పట్టించుకోవటంలేదు. జనాల నమ్మడంతో పట్టింపులేకుండా తాను చెప్పదలచుకున్నది చెప్పేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడినా అచ్చేసే మీడియా ఉండటమే కారణం. ఇక ప్రస్తుతానికి వస్తే పట్టాభిని కొట్టారని ఎంపీ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

ఎందుకంటే తనను పోలీసులు కొడితే ఆ విషయం సదరు నేతే బయటకు చెప్పుకోగలరు. ఒకవేళ పట్టాభికి ఏమైనా ఇబ్బంది ఉందనుకుంటే అదే విషయాన్ని చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, లోకేష్ లాంటి నేతలు చాలామందున్నారు గోల చేయటానికి. తనను కస్టడీలో పోలీసులు కొట్టినట్లు పట్టాభి కానీ లేదా చంద్రబాబు అండ్ కో లో ఎవరు చెప్పలేదు. పైగా తనను అరెస్టు చేయటం ఖాయమని అర్ధమైపోగానే పట్టాభి తన శరీరాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన విషయం గుర్తుంచుకోవాలి.

ఇక పట్టాభిని కొట్టారా లేదా అన్న విషయాన్ని విజయసాయి చెప్పాలట. అసలు విజయసాయికి ఏమి సంబంధం ఈ ఇష్యూతో. తనదగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఎంపీ నిజంగానే ఆధారాలుంటే బయటపెట్టచ్చు కదా. ఎంపీ ఆధారాలను బయటపెడతానంటే ఎవరైనా వద్దన్నారా ? బయటపెట్టకుండా ఆధారాలున్నాయని మాత్రమే చెబుతున్నారంటే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే ఉంది. కస్టడీలో తనకు జరిగినదే పట్టాభికి కూడా జరిగుంటుందని ఎంపీ అనుకున్నారా ? లేక నిజంగానే పోలీసులు కొట్టినా పట్టాభి బయటకు చెప్పుకోలేకపోతున్నారా ? అయినా దెబ్బలు పట్టాభికి లేని దురద ఎంపీకి ఎందుకసలు.