Begin typing your search above and press return to search.

ఎంపీ రాజీనామా చేస్తారా ?

By:  Tupaki Desk   |   14 Dec 2021 6:31 AM GMT
ఎంపీ రాజీనామా చేస్తారా ?
X
అధికారపార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తొందరలోనే రాజీనామా చేయబోతున్నారా ? ఇపుడిదే విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

ఈనెలలోనే రఘురాజు నరసాపురం పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమధ్యనే తిరుపతిలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ నేతలతో మాట్లాడుతు ఇతర పార్టీల్లోని గట్టి నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే.

ఇతర పార్టీల్లోని నేతలను బీజేపీలో చేర్చుకోవాలని చెప్పిన సందర్భంలో రఘురాజు పేరును షా ప్రస్తావించినట్లు ప్రచారం జరిగింది. దాంతో వైసీపీకి తిరుగుబాటు ఎంపీ గుడ్ బై చెప్పేసి బీజేపీలోకి చేరటం ఖాయమని ఊహాగానాలు మొదలైపోయాయి.

మరి తెరవెనుక ఏమి జరుగిందో ఏమో కానీ సోషల్ మీడియాలో రఘురాజు ఈనెల 17 కానీ లేకపోతే 25వ తేదీన కానీ రాజీనామా చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

న్యాయస్ధానం టు దేవస్ధానం పేరుతో అమరావతి జేఏసీ చేస్తున్న పాదయాత్ర ముగింపు సభ ఈనెల 17వ తేదీన తిరుపతిలో భారీఎత్తున చేయాలని ప్లాన్ జరుగుతోంది.

ఆ సమయంలోనే తిరుగుబాటు ఎంపీ తన రాజీనామా నిర్ణయాన్ని బహిరంగసభలో ప్రకటిస్తారని సమాచారం. ఒకవేళ ఆరోజు కాకపోతే ఇదే నెల 25వ తేదీన మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయ్ జయంతి సందర్భంగా ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

ఏదేమైనా రఘురాజు ఎంపీ పదవికి రాజీనామా చేయటం వల్ల జరిగే ఉపఎన్నిక మాత్రం చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే రఘురాజు వ్యవహారశైలిపై జగన్మోహన్ రెడ్డి అండ్ కో బాగా మంటమీదుంది. రాజీనామా చేసిన తర్వాత రఘురాజే ఉపఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారనటంలో సందేహంలేదు.

మరప్పుడు నరసాపురంలో త్రిముఖ పోటీ జరుగుతుందా ? లేకపోతే వైసీపీ అభ్యర్ధిని ఓడించటం కోసం ప్రతిపక్షాలన్నీ చేతులు కలుపుతాయా అన్నది చూడాలి. ఎంపీ రాజీనామా చేస్తే, ఉపఎన్నికలు వస్తే జగన్ సత్తానా ? లేకపోతే ప్రతిపక్షాల సత్తానా ? అన్నది తేలిపోతుంది.