Begin typing your search above and press return to search.

విజయసాయికి రఘురామ ఘాటు లేఖ

By:  Tupaki Desk   |   26 Jun 2020 6:08 AM GMT
విజయసాయికి రఘురామ ఘాటు లేఖ
X
కొంతకాలంగా సొంత పార్టీ వైసీపీపై నిరసన గళం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వైసీపీ నాయకత్వం ఇటీవలే షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అది చూశాక చర్యలు ఉంటాయని తెలిపింది.

తాజాగా ఈ నోటీసుపై ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. వైసీపీ నుంచి తనకు నోటీసు వచ్చిందన్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ తరుఫున నోటీసులు జారీ చేశారని.. వైసీపీ ప్రాంతీయ పార్టీ అని.. దానికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని.. విజయసాయిరెడ్డి పేరుతో నోటీసులు ఎలా పంపిస్తారని విమర్శించారు.

పార్టీ పంపిన షోకాజ్ నోటీసు నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు తాజాగా విజయసాయిరెడ్డికి పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రతి లేఖ రాశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నానంటూ సంజాయిషీకి మీరెలా లేఖ పంపుతారని ’ లేఖలో రఘురామ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. మెజారిటీ సభ్యులు నాపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారా? అలా చేస్తే ఆ మినిట్స్ ప్రతిని తనకు పంపాలని లేఖలో డిమాండ్ చేశారు.

మీరు పంపిన లేఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని.. లెటర్ హెడ్ పై పేర్కొన్న పార్టీ పేరే తప్పు అని రఘురామకృష్ణం రాజు లేఖలో దుయ్యబట్టారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరుఫున గెలిచానని.. వైసీపీ పేరు మారిందా అంటూ ప్రశ్నించారు. నోటీసుకు చట్టబద్ధత లేదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడే పంపాలని.. ప్రధాన కార్యదర్శి ఎలా సంజాయిషీ కోరుతారని లేఖలో ప్రశ్నించారు. మీలాంటి వారి వల్లే పార్టీ నష్టపోతుందన్నారు. క్రమశిక్షణ కమిటీ కోరితే సంజాయిషీ ఇస్తాను అని స్పష్టం చేశారు.

ఇక విజయసాయిరెడ్డి తనకు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి రఘురామకృష్ణం రాజు పంపారు. లేఖ అందినట్లుగా రఘురామకు ఎన్నికల సంఘం ఈమెయిల్ లో సమాధానం ఇచ్చింది. వైసీపీలో అసలు క్రమశిక్షణ సంఘం లేదని.. దానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి లేఖ వ్యవహారం చూడాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడం చర్చనీయాంశమైంది. ఈ ఎత్తుగడ ఏమిటనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తంగా రఘురామకృష్ణం రాజు తీరు చూస్తుంటే తనకు షోకాజ్ ఇచ్చిన సొంత పార్టీపైనే రివర్స్ అటాక్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.