Begin typing your search above and press return to search.

పార్టీకి వీర సైనికుడ్ని అంటూ విజయసాయికి భారీ పంచ్ లు వేశారే?

By:  Tupaki Desk   |   27 Jun 2020 4:00 AM GMT
పార్టీకి వీర సైనికుడ్ని అంటూ విజయసాయికి భారీ పంచ్ లు వేశారే?
X
గడిచిన కొద్ది రోజులుగా ఏపీ అధికారపక్షంలో కలకలంగా మారిన నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరింతగా చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కళ్లు.. ముక్కు.. చెవులు అయిన విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు సంచలనంగా మారాయి. విజయసాయి తనకు తప్పుగా నోటీసులు ఇచ్చినట్లుగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.

‘రాజద్రోహం’ చేశారంటూ తన మీద అభియోగం మోపుతూ విజయసాయి తనకిచ్చిన షోకాజ్ నోటీ కారణంగా తన ఎంపీ సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రద్దు అయ్యే పరిస్థితి తెచ్చారన్నారు. తనకిచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పేందుకు ఇంకా సమయం ఉందన్న ఆయన.. గడువు లోపు పార్టీ అధ్యక్షుల వారికి లేఖ పంపుతానని చెప్పారు. షోకాజ్ గడువు ఈ నెల 29(సోమవారం)న అని.. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ కు లేఖ రాస్తానని చెప్పారు.

పార్టీకి లేఖ పంపిన తర్వాత.. ఒంటి గంటకు మీడియాతో మాట్లాడతానని చెప్పారు. ‘‘నేను ముఖ్యమంత్రిని కానీ పార్టీని కానీ చిన్నమాట అనలేదు. రాజ్యాంగంలోని 350.. 350ఏ అధికరణల ప్రకారం మాతృభాషలో విద్యా భోదన జరగాలని చెప్పా. ఈ విషయాన్ని చెప్పినందుకే షోకాజ్ నోటీసు ఇవ్వటం రాజ్యాంగాన్ని వ్యతిరేకించటమే అవుతుంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్ సభలో ప్రాచీన భాష అంశంపై మాట్లాడారు. ఆ సందర్భంగా కలుగజేసుకొని మాట్లాడా. తెలుగు భాషపై మక్కువతోనే జగన్ తెలుగు అకాడమీని పెట్టారు. విజయసాయి పంపిన షోకాజ్ నోటీసులో.. ప్రభుత్వ అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తానని చెబితే.. తెలుగు మీడియం అనటం రాజద్రోహం కాదా? అని ప్రశ్నించారు. అదెలా తప్పు అవుతుంది’’ అని పేర్కొన్నారు.

అధినేత జగన్ పై అపారమైన గౌరవం ఉందని.. తాను పార్టీలో కొనసాగుతానని చెప్పిన ఆయన.. తాను కర్నల్ సంతోష్ బాబు మాదిరి పార్టీకి వీరసైనికుడినని పేర్కొన్నారు. పార్టీలో నిజమైన స్వామిభక్తి ఉన్న వాడిని తానేనని చెప్పారు. తనపై విజయసాయి కోపం ఎందుకు పెంచుకున్నారో? ఎందుకు బూచోడిగా చూస్తున్నారో తెలీటం లేదు. ఎంపీలు ఎవరూ ముఖ్యమంత్రికి సలహాలు.. సూచనలు ఇవ్వలేదన్నారు. తనను శరద్ యాదవ్ లా ఎంపీ పదవి నంచి తప్పించటం వీలు కాదని స్పష్టం చేశారు.

‘‘పార్టీ నుంచి తప్పించాలని నెలరోజులుగా కుట్ర పన్నుతున్నారు. దీని కోసం అనుకూల మీడియాలో లీకులు ఇస్తున్నారు. శరద్ యాదవ్ ఉదాహరణ ఇందులో భాగమే. ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం షోకాజ్ నోటీసు ఇచ్చారేు’’ అంటూ మండిపడ్డారు. ఓవైపు అధినేత అంటే అమితమైన గౌరవం అంటూనే.. మరోవైపు ఆయనకు అత్యంత సన్నిహితుడైన విజయసాయి మీద నరసాపురం ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. మరీ.. సిత్రమైన పరిస్థితిని జగన్ ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరమని చెప్పక తప్పదు.