Begin typing your search above and press return to search.

ఆ లేఖ జగన్ సర్కారును అంతలా ఇబ్బందికి గురి చేస్తోందా?

By:  Tupaki Desk   |   4 Aug 2021 11:30 AM GMT
ఆ లేఖ జగన్ సర్కారును అంతలా ఇబ్బందికి గురి చేస్తోందా?
X
అవును.. జగన్ సర్కారు ఇబ్బంది పడుతోంది. అది కూడా సొంత పార్టీ ఎంపీ పుణ్యమా అని. ఇంటిగుట్టుగా ఉండాల్సిన విషయాల్ని ఓపెన్ చేస్తూ.. నరసాపురం ఎంపీ రఘురామ రాసిన లేఖపై కేంద్రం రియాక్టు కావటం.. ఏపీ ఆర్థికపరిస్థితి మీదా.. ఏపీ తీసుకొస్తున్నఅప్పుల మీద డేగ కన్ను వేయటమే కాదు.. కొత్త పరిమితుల్ని తీసుకురావటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు.. ప్రభుత్వ ఇమేజ్ ను మరింత పెంచేందుకు వీలుగా ఆయన ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రకటిస్తున్న వరాలతో ఏపీ బడ్జెట్ తడిచి మోపెడు అవుతోంది. ఇంత భారీ ఖర్చును భరించటానికి తగ్గ ఆదాయం లేకపోవటంతో.. అప్పులు తీసుకురావటం మినహా మరో మార్గం లేని పరిస్థితి.

కిందామీదా పడుతున్న జగన్ సర్కారు.. ఆర్థిక సమస్యలకు తరుణోపాయంగా అప్పుల్ని తీసుకురావటం.. ఆస్తుల్ని తాకట్టు పెట్టటం లాంటివి షురూ చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వచ్చే ఇరవై ఏళ్ల మద్యం ఆదాయాన్ని గ్యారెంటీగా పెట్టి మరీ రుణాలు తీసుకుంటున్న వైనం బయటకు రావటం.. ఇది కాస్తా కేంద్రం వరకు వెళ్లటంతో ఆర్థికశాఖ రియాక్టు అయ్యింది. ఈ తీరు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ పేరుతో గత ఏడాది ఏపీలో ఏర్పాటు చేసిన జగన్ సర్కారు.. దాని ద్వారా రుణాల్ని తీసుకొస్తోంది. రుణాలుగా తీసుకొచ్చిన మొత్తాన్ని సంక్షేమ పథకాలకు వాడటం ఒక ఎత్తు అయితే.. భవిష్యత్తు ఆదాయాల్ని తాకట్టు పెట్టటాన్ని తప్పు పడుతూ కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం పంపిన లేఖ ఏపీ సర్కారుకు కొత్త కష్టాల్ని తీసుకొచ్చింది.

దీనంతటికి కారణం ఎంపీ రఘురామ కేంద్రానికి రాసిన లేఖనే. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని.. తీసుకొస్తున్న అప్పుల లెక్కల్ని అర్థమయ్యేలా లేఖ రాయటంతో కేంద్ర సర్కారు అలెర్టు అయి.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయటంతో పాటు.. ఇలాంటి తీరు సరికాదని తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖలో.. ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ ద్వారా రుణ సేకరణ సరికాదని స్పష్టం చేయటంతో పాటు.. బ్యాంకుల నుంచి రుణాల్ని తీసుకుంటున్న వైనాన్ని తప్పు పట్టింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3).. ఆర్టికల్ 266(1)కు విరుద్ధంగా ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ ఏర్పాటైందని పేర్కొనటం గమనార్హం. ఈ సంస్థ తీరు ఇలా ఉంటే.. రానున్న ఇరవై ఏళ్లకు మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని గ్యారెంటీగా చూపించి బ్యాంకు రుణం తీసుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. గత ఏడాది ఏపీ ప్రబుత్వం రూ.18,500 కోట్లను ఈ తీరులో తీసుకున్నట్లుగా గుర్తించిన ఆర్థిక శాఖ తప్పు పడుతోంది. తన ద్రష్టికి వచ్చిన అంశాలపై వివరణ కోరుతూ ఒక సమగ్ర నివేదికను రాష్ట్రాన్ని అడిగినట్లు చెబుతున్నారు.

దీనికి తోడు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాల్ని కాగ్ నివేదిక బయటపెట్టటం తెలిసిందే ఇందులో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే ఏపీ ఏకంగా రూ.19,714 కోట్ల రుణాల్ని తీసుకొని ఖర్చు చేసినట్లుగా పేర్కొంది. ఏపీ తర్వాత కేరళ రాష్ట్రం ఉందని.. ఆ రాష్ట్రం రూ.14,010 కోట్ల రుణాల్ని తీసుకుంది. మిగిలిన రాష్ట్రాలు రూ.10వేల కోట్లు తీసుకోగా.. అందరికంటే అతి తక్కువగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.1925 కోట్లు మాత్రమే తీసుకోవటం గమనార్హం. ఇలా అందిన కాడికి అప్పులు చేయటం.. గ్యారెంటీలుగా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపిస్తే.. ఫ్యూచర్ ఏంటి? అన్నది ప్రశ్నగా మారింది.

ఈ కారణాలతోనే స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ ఏపీ ఆర్థిక వ్యవహారాల్ని మరింత లోతుగా వివరాలు సేకరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. కేంద్ర ఆర్థిక శాఖ అడిగినట్లుగా ఏపీ ప్రభుత్వ స్పందన ఏమిటన్నది ప్రశ్న. కేంద్రం అడిగిన నివేదికతో ఏపీ సర్కారు ఇరుకున పడిందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. కేంద్రం అడిగిన సమాచారం ఇస్తే ఒక సమస్య. ఇవ్వకుంటే మరో సమస్య. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్నది ఇప్పుడున్న అసలు సమస్యగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.