Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్

By:  Tupaki Desk   |   14 May 2021 12:10 PM GMT
బ్రేకింగ్: ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్
X
వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఈరోజు ఎంపీ రఘురామ పుట్టినరోజు. పైగా శుక్రవారం. ఈరోజు అరెస్ట్ చేయడంతో వచ్చే మూడు రోజుల వరకు ఎంపీ రఘురామకు బెయిల్ దొరకడం కష్టంగా మారుతుందని.. వ్యూహాత్మకంగా ఈ అరెస్ట్ చేసినట్టు అర్థం అవుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి..

ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లోని రఘురామ ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామకృష్ణం రాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.. అయితే రఘురామను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులను మొదట్లో సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చిచెప్పారు.

అయితే ఏపీ సీఐడీ పోలీసులు మాత్రం బలవంతంగా ఎంపీ రఘురామను అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తూ ఏపీ సర్కార్ పై.. సీఎం జగన్ ఎంపీ రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఆయన ఇంటి గోడకు నోటీసులు కూడా అందించినట్టు చెబుతున్నారు. రఘురామ అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ అరెస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.