Begin typing your search above and press return to search.

చర్లపల్లి జైలుకు రేవంత్..14 రోజులు అక్కడే

By:  Tupaki Desk   |   5 March 2020 4:19 PM GMT
చర్లపల్లి జైలుకు రేవంత్..14 రోజులు అక్కడే
X
టీ కాంగ్రెస్ కీలక నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి మరోమారు అరెస్ట్ అయ్యారు. గురువారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టులో రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... నేరుగా ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచి... న్యాయమూర్తి ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు లీజుకు తీసుకున్న ఫాం హౌజ్ పై డ్రోన్ కెమెరాలను ఎగురవేసిన కేసులో పోలీసులు రేవంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేటీఆర్ ఫాం హౌజ్ పై డ్రోన్ కెమెరాను ఎగరవేశారన్న ఆరోపణ ఆధారంగా రేవంత్ పై ఎయిర్ క్రాఫ్ చట్టం ఐపీసీ 184, 187 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హుటాహుటీన ఆయనను గోల్కొండ హాస్పిటల్ కు తీసుకొచ్చిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత అక్కడి నుంచి రేవంత్ ను రాజేంద్ర నగర్ లోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి, జడ్జీ ముందు ప్రవేశపెట్టారు.

అరెస్ట్ కు సంబంధించిన పత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రేవంత్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్ తో పాటు మరో ఐదుగురిపైనా కేసులు నమోదు కాగా... వారంతా ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ క్రమంలో రేవంత్ అరెస్ట్ కోసం రంగంలోకి దిగిన పోలీసులు... పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో రేవంత్ ఉన్నారన్న సమచారం అందగానే... అక్కడకు వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. గతంలో ఓటుకు నోటు కేసులో ఏకంగా నెల పాటు జైలు జీవితం గడిపిన రేవంత్ రెడ్డి.. మరి ఈ కేసులో ఎన్ని రోజులు జైలులో ఉండాల్సి వస్తుందో చూడాలి.