Begin typing your search above and press return to search.

అసలైన వాళ్లను వదిలేసి అమాయకులను అరెస్ట్​ చేస్తారా?

By:  Tupaki Desk   |   5 Feb 2021 10:30 AM GMT
అసలైన వాళ్లను వదిలేసి అమాయకులను అరెస్ట్​ చేస్తారా?
X
రైతు ఉద్యమంపై శుక్రవారం రాజ్యసభ దద్దరిల్లింది. శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల పట్ల కేంద్రప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుంటే.. సమస్యను పరిష్కరించకుండా.. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రైతుల సమస్యను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని.. అంతేకానీ వాళ్లపై తప్పుడు ఆరోపణలు చేయడం.. వాళ్లను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం ఏమిటని ప్రశ్నించారు.

2 నెలలుగా అన్నదాతలు ఉద్యమిస్తుంటే కేంద్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నదని.. చర్చల పేరుతో కాలయాపన చేసిందని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘అన్నదాతలు ఈ దేశ పౌరులే ఆ విషయాన్ని కేంద్రం గుర్తించారు. వాళ్లను శత్రువుల్లా చూడటం మానేయాలి. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, రైతులు ఇలా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా.. వాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు హింస చెలరేగింది. త్రివర్ణ పతాకాన్ని కొందరు అవమానించారు. ఈ విషయాన్ని జాతి మొత్తం ఖండించింది.

అయితే జాతీయ జెండాను అవమానించిన దీప్​ సిద్దూ కనిపించకుండా పోయారు. అమాయకులైన రైతులను మాత్రం ప్రభుత్వం అరెస్ట్​ చేసింది. ఇదెక్కిడి న్యాయం. దీప్​ సిద్దూను ఇన్నిరోజులైనా ఎందుకు పట్టుకోలేకపోయారు. పోలీసులు తలుచుకుంటే అతడిని అరెస్ట్​ చేయలేరా? దీప్​ సిద్ధూ ఎవరో మాకు తెలియదని రైతులు అంటున్నారు. అతడు ఈ ఉద్యమంలోకి ఎలా వచ్చాడు? ఈ విషయాలు ఆరా తీయకుండా కేంద్రం సమస్యను తప్పుదారి పట్టిస్తోంది’ అంటూ సంజయ్​ రౌత్​ మండిపడ్డారు.

రైతుల ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. అయితే వాళ్లపై కేంద్రం మండిపడింది. మా దేశ సమస్యను మేము పరిష్కరించుకోగలం అని కేంద్రం పేర్కొన్నది. మరికొందరు భారతీయ ప్రముఖులు కూడా విదేశీ జోక్యాన్ని తప్పుపట్టారు.