Begin typing your search above and press return to search.

కేసీఆర్ పెద్ద మ‌న‌సు...ఖుష్ అయిన న‌మ్మిన‌బంటు

By:  Tupaki Desk   |   22 July 2020 4:15 PM GMT
కేసీఆర్ పెద్ద మ‌న‌సు...ఖుష్ అయిన న‌మ్మిన‌బంటు
X
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని పోలీస్‌ శాఖను కోరారు. ప్రగతి భవన్‌లో ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు. దీనిపై, తెలంగాణ సీఎం కేసీఆర్ న‌మ్మిన‌బంటు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సంతోషం వ్య‌క్తం చేశారు. చాలా సంతోషంగా ఉందని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.


తాను ఈ మధ్య కాలంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి చర్లపల్లి జైలు సందర్శించిన సందర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌లు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పంచుకున్నారు. ఖైదీలు వారికి ఉన్న సమస్యలతో పాటు మేము చాలా కాలంగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నమని మాలో మార్పు వచ్చిందని చేసిన తప్పున‌కు పశ్చాత్తాపం పడుతున్నామని త‌మ కోసం త‌మ కుటుంబం, పిల్లలు ఎదురు చూస్తున్నారని కాబట్టి దయచేసి వచ్చే పంద్రాగస్టు (ఆగస్టు 15) సందర్భంగా సత్ ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని వేడుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

త‌న‌కు చేసిన విజ్ఞప్తి మేరకు వారి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోయాన‌ని ఎంపీ సంతోష్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో స్పందించి వారి విడుదల కోసం మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది పంద్రాగస్టు సందర్భంగా వివిధ జైళ్ళలో శిక్షణా అనుభవిస్తు సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడానికి జాబితాను తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించార‌ని ట్విట్ట‌ర్ వేదికగా సంతోషం వ్య‌క్తం చేశారు.